
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చాలా సౌమ్యుడు.. చీమకి కూడా హాని తలపెట్టని వ్యక్తి అని.. అలాంటి నాయకుడిపై దాడి జరగడం విచారకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికిందరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన తలసాని మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో తలపడాలి కానీ.. భౌతిక దాడులకు దిగడం సరైంది కాదన్నారు. తెలంగాణ లో ఈ పద్ధతి ఎప్పుడూ లేదని.. మొదటిసారి ఇలా జరిగిందని చెప్పారు. గన్ మెన్ అప్రమత్తతో ప్రాణహాని తప్పిందని.. పార్టీ సిద్ధాంతాలు చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలి... కానీ, భౌతిక దాడులు చేయడం సరైంది కాదన్నారు. ప్రభాకర్ రెడ్డికి పెద్ద గాయం అయ్యిందని.. అయిదు గంటలుగా సర్జరీ జరుగుతోంది అంటేనే అర్థం చేసుకోవాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి ప్రపంచమే చెప్పుకుంటోందని ఆయన అన్నారు.బిఆర్ఎస్ సహా అన్ని పార్టీల అభ్యర్థులకు భద్రత పెంచాల్సి ఉందని... ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని తలసాని పేర్కన్నారు.