మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం

మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలోని సనత్ నగర్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు.  సనత్ నగర్ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ తరుఫున మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా తలసాని ఎన్నికల బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాంగోపాల్ పేట్ డివిజన్ లోని ఆవుల మంద, నాగన్న దేవిడి, కళాసిగూడ, బర్తన్ కాంపౌండ్,  కండోజీ బజార్ తోపాటు తదితర ప్రాంతాల్లో మంత్రి తలసాని ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూ తనకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్ధించారు. 

నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అనేక అభివృద్ధి పనులు చేశానని తలసాని తెలిపారు. అయితే, కొంతమంది మహిళలు తమకు ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లు రాలేదని మంత్రిని అడగగా.. మీకు కూడా వస్తాయని, తొందరపకండా ఓపికతో ఉంటేనే అన్నీ వస్తాయని..ఏలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా మన చుట్టుపక్కల ఉన్న వారికి వచ్చినవి..కనుక మీకు కూడా అలానే వస్తాయని మంత్రి తలసాని మహిళలకు సర్ది చెప్పారు. అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండే తనకే వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలను కోరారు.