గణేశ్ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తాం : తలసాని

గణేశ్ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తాం : తలసాని
  • వచ్చే నెల 19న పండుగ,  28న నిమజ్జనం

హైదరాబాద్, వెలుగు : వచ్చే నెల 19న గణేశ్ నవరాత్రి ఉత్సవాలను మొదలవుతాయని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. 28న నిమజ్జనం ఉంటుందన్నారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి ఆయన సమావేశమయ్యారు. తలసాని మాట్లాడుతూ..  సిటీతో పాటు శివార్లలో 32,500 వరకు వినాయక మండపాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. 

శోభాయాత్ర నిర్వహించే అన్ని రూట్​ల అభివృద్ధి, మరమ్మతులు, లైటింగ్, చెట్ల కొమ్మలు అడ్డు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బందోబస్తుకు జిల్లాల పోలీసు అధికారులను నియమిస్తామని, నవరాత్రులు ముగిసేదాకా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ట్రాన్స్ ఫార్మర్లను అందుబాటులో ఉంచుతామన్నారు.