అక్బర్​ది అతి తెలివి..ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం

అక్బర్​ది అతి తెలివి..ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరోనాపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నోట్​పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ రాద్ధాంతం చేయడం సరికాదని, ఆయన అతి తెలివి ప్రదర్శించారని మంత్రి తలసాని శ్రీనివాస్ ​యాదవ్​ విమర్శించారు. నోట్​లో ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పిందని, అన్ని అంశాలను షార్ట్​ డిస్కషన్​ నోట్ లో చెప్పడం సాధ్యం కాదన్నారు. సీనియర్ సభ్యుడైనంత మాత్రాన అక్బర్ ఏది పడితే అది మాట్లాడతానంటే కుదరదని హెచ్చరించారు.  బుధవారం అసెంబ్లీ  బయట మంత్రి తలసాని మీడియాతో చిట్ చాట్ చేశారు. లాక్ డౌన్ టైంలో ఎంఐఎం ఒక్కటే కాదు అందరూ సేవ చేశారని,  సందర్భం లేకుండా అసెంబ్లీ లో మాట్లాడటం టైంను దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి కాదన్నారు. అక్బర్ కు సీఎం మంచిగా సమాధానం ఇచ్చారని ఆయన  వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అంత అమాయకమైందేమీ కాదని, అన్నీ తెలుసని, సందర్భాన్ని బట్టి మాట్లాడతామని, తామేమి రాజకీయాల్లోకి ఇప్పుడే రాలేదని తలసాని అన్నారు. ‘‘రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. మార్పు జరుగుతుంది.  బాధ్యత లేకుండా అక్బర్ మాట్లాడితే ఎందుకు ఊరుకుంటాం. ఓవర్ స్మార్ట్ గా అక్బర్ వ్యవహరించొద్దు. పార్టీల బలాబలాలను బట్టి సభ్యులకు అసెంబ్లీలో టైం ఇవ్వడం ఈనాటిది కాదు. మాకు కూడా సంఖ్యా బలాన్ని బట్టి టైం కేటాయించాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉంది” అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ప్రతిపక్షాలకు పార్టీ ఆఫీస్ లు ఉన్నాయి కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌‌‌‌ నేత భట్టి విక్రమార్క అపర మేధావి లా వ్యవహరిస్తుంటారని, ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడం చేత కాదని తలసాని విమర్శించారు.

రెవెన్యూ చట్టం చరిత్రాత్మకం

అసెంబ్లీ లో రెవెన్యూ చట్టం ప్రవేశ పెట్టడం చరిత్రాత్మకం అని  మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ అంతా కొత్త చట్టం తో పండుగ వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు. పనుల కోసం రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయారని, కొత్త చట్టంతో వారికి పెద్ద ఊరట లభించినట్టయిందన్నారు. అవినీతి బెడద పూర్తిగా తొలగిపోతుందని మంత్రి  పేర్కొన్నారు.