టాలెంట్‌‌ను సమాజాభివృద్ధికి ఉపయోగించాలి : గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ సూచన

టాలెంట్‌‌ను సమాజాభివృద్ధికి ఉపయోగించాలి : గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ సూచన

నిజామాబాద్, వెలుగు : రాష్ట్రంలోని యూనివర్సిటీలు అద్భుత విజయాలు సాధిస్తూ ప్రగతి వైపు దూసుకెళ్తున్నాయని గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ చెప్పారు. యూనివర్సిటీల్లో చదువుకున్న గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు సాధించి దేశంలో 51 శాతం నైపుణ్యాల కొరత తీరుస్తున్నారన్నారు. 2023– 24 ఆర్థిక సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు. బుధవారం తెలంగాణ వర్సిటీలో నిర్వహించిన కాన్వొకేషన్‌‌కు ఐఐసీటీ మాజీ డైరెక్టర్‌‌ చంద్రశేఖర్‌‌తో పాటు గవర్నర్‌‌ హాజరై పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌‌ మాట్లాడుతూ విద్య అంతిమ లక్ష్యం క్రియేటివిటీతో పాటు ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని చారిత్రక అభివృద్ధి వైపు వెళ్లడమే కావాలన్నారు.

 కొఠారి కమిషన్‌‌  చెప్పినట్లుగా దేశ భవిష్యత్‌‌ క్లాస్‌‌ రూమ్స్‌‌లోనే ఉందన్న సత్యాన్ని అన్ని వర్సిటీలు గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని, దానిని సమాజం కోసం ఉపయోగించాలని, అలాంటి వారిని యంత్రాంగం కూడా ప్రోత్సహించాలన్నారు. టాలెంట్‌‌ ఒక చోట కలిస్తే అద్భుతాలు ఆవిష్కరించే వీలు కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా 132 మందికి గోల్డ్‌‌ మెడల్స్‌‌, 156 మందికి డాక్టరేట్‌‌ అందజేశారు. కార్యక్రమంలో టీయూ వీసీ టి.యాదగిరిరావు, కలెక్టర్‌‌ వినయ్‌‌ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, డీన్‌‌ గంటా చంద్రశేఖర్, ప్రిన్సిపాల్‌‌ డాక్టర్ ప్రవీణ్‌‌ పాల్గొన్నారు.

టీబీ ముక్త్‌‌ భారత్‌‌కు కృషి చేయాలి

టీబీ ముక్త్‌‌ భారత్‌‌కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌‌లో  నిర్వహించిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు. టీబీపై విస్తృతంగా ప్రచారం చేయాలని, స్క్రీనింగ్‌‌ క్యాంపులు నిర్వహించాలని చెప్పారు. టీబీ పట్ల ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను సాహితీ, సేవా, క్రీడారంగాలకు చెందిన వారిని తీసుకోవాలని.. ఇందుకు స్టేట్‌‌ అంబాసిడర్లుగా ఇందూరు జిల్లాకు చెందిన, ఎవరెస్ట్‌‌ అధిరోహించిన మాలావత్‌‌ పూర్ణ, ఫుట్‌‌బాల్‌‌ క్రీడాకారిణి గుగులోత సౌమ్య తీసుకోవాలని చెప్పారు. రెడ్‌‌ క్రాస్‌‌ సంస్థ సైతం ఇందులో భాగస్వామ్యం కావాలని సూచించారు.