తమిళ సినిమా, టీవీ పరిశ్రమల బంద్

తమిళ సినిమా, టీవీ పరిశ్రమల బంద్
  • నెలాఖరు వరకు షూటింగులతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం నిలిపివేత
  • ప్రస్తుతం 2 సినిమాలు, 16 టీవీ షోల షూటింగులు జరుగుతున్నాయి.. 
  • వాటిని కూడా ఆపేయమని చెప్పాం:  ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆర్ కె సెల్వమణి

చెన్నై: కరోనా మహమ్మారి సునామీలా విజృంభణ అన్ని రంగాలను స్తంభింప చేస్తోంది. శరవేగంగా వ్యాపిస్తున్న ఈ మహమ్మారి కట్టడి చర్యలకు తమిళ సినీ పరిశ్రమ సైతం ముందుకొచ్చింది. సినిమాల షూటింగులే కాదు.. టీవీ షోలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి నెలాఖరు వరకు అన్ని పనులు ఎక్కడికక్కడే ఆపేయడం జరుగుతుందని, ప్రస్తుతం రెండు సినిమాలు, 16 టీవీ షోలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని.. వాటిని ఆపేయమని చెప్పామని  ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు (FEFC)  ఆర్ కె సెల్వమణి వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు తమిళనాడులో సినీ, టివీ పరిశ్రమలకు సంబంధించి అన్ని పనులను నిలిపివేస్తున్నామన్నారు. కరోనా విస్తృతంగా వ్యాపిస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న దృష్ట్యా షూటింగ్‌లతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా నిలిపివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది.. మన దేశంలో ముఖ్యంగా సినీ పరిశ్రమ కూడా చాలా మందిని పోగొట్టుకుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న కట్టడి చర్యలకు సహకరించేందుకు  నెలాఖరు వరకు సినీ, టీవీ ప్రాజెక్టులు ఏవీ చేపట్టకుండా నిలిపివేస్తున్నామని ఆయన వివరించారు.