తమిళనాడులో కొత్తగా ఏర్పడ్డ విజయ్ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు వెళ్ళింది. బుధవారం ( మే 13 ) సభలో విశ్వాస పరీక్షా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సీఎం విజయ్. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు విశ్వాస తీర్మానానికి మద్దతివ్వగా.. మిగిలిన పార్టీలు వీసీకే, ఐయూఎంఎల్ మద్దతిస్తూనే విజయ్ ప్రభుత్వానికి చురకలు అంటిస్తున్నాయి. జ్యోతిషుడు రాధన్ పండిట్ వెట్రివేల్ ను విజయ్ ఓఎస్డీగా నియమించడంపై మండిపడుతోంది వీసీకే. జ్యోతిష్యానికి ప్రాధాన్యత ఇవ్వకూడదని అన్నారు వీసీకే ఎమ్మెల్యే వన్ని అరసు. శాస్త్రీయమైన ఆలోచన విధానంపై ఫోకస్ చేయాలి కానీ... జ్యోతిష్యానికి కాదని అన్నారు.
విజయ్ ప్రభుత్వం ఐదేళ్లపాటు సాఫీగా కొనసాగాలని అన్నారు. తమిళనాడులో గవర్నర్ పాలన రాకూడదనే టీవీకే కి మద్దతు ఇచ్చామని అన్నారు వీసీకే ఎమ్మెల్యే అరసు.జ్యోతిష్యుడిని నమ్ముకొని పాలన చేయొద్దని సూచించింది వీసీకే పార్టీ. బీజేపీ డర్టీ పాలిటిక్స్ ను అడ్డుకునేందుకే టీవీకేకు మద్దతు తెలిపామని అంటోంది ఐయుఎంఎల్ పార్టీ.
డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత కూడా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే.. సీఎంగా విజయ్ చేసిన మంచిని సమర్థిస్తూనే కౌంటర్ ఇచ్చారు ప్రేమలత. విజయ్ ఓఎస్డీగా రాధన్ నియామకాన్ని తప్పుబట్టారు ప్రేమలత. మీకు ఓటేసింది యువత, జ్యోతిష్యులు కాదని అన్నారు. నమ్మకం ఉంటే జ్యోతిష్యులను ఇంట్లో ఉంచుకోవాలని.. కీలక పదవుల్లో ఇలాంటివారిని తీసుకురావడం సరికాదని అన్నారు ప్రేమలత.
అయితే.. విశ్వాస పరీక్షకు డీఎంకే దూరంగా ఉన్నట్లు ప్రకటించగా... అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. తమిళనాడులో విద్వేష రాజకీయాలు కోరుకోవడం లేదు కాబట్టే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని తెలిపింది కాంగ్రెస్. గవర్నర్ కావాలనే విజయ్ ను ఇబ్బంది పెట్టారని.. ప్రమాణస్వీకారానికి ఆలస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది సీపీఎం.
