Bharathiraja: ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజాకు చివరి వీడ్కోలు.. సీఎం విజయ్ నిర్ణయంపై TFAPA హర్షం

Bharathiraja: ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజాకు చివరి వీడ్కోలు.. సీఎం విజయ్ నిర్ణయంపై TFAPA హర్షం

దిగ్గజ దర్శకుడు, విలక్షణ నటుడు భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు సీఎం విజయ్ ప్రకటించారు. తమిళ సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

భారతీరాజా స్థాపించిన తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (TFAPA).. ఆయనకు ప్రభుత్వ గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కోరగా, సీఎం విజయ్ వెంటనే ఆమోదం తెలిపారు. అనంతరం ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం విజయ్‌కు TFAPA కృతజ్ఞతలు తెలిపింది.

‘‘మా వ్యవస్థాపక అధ్యక్షుడు, దిగ్గజ దర్శకుడు భారతీరాజా గారికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గౌరవం కల్పించినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి విజయ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గౌరవం భారతీరాజా గారి అసమాన సినీ సేవలకు లభించిన గొప్ప గుర్తింపు’‌‌‌‌‌‌‌’‌‌‌‌‌‌ అని TFAPA తన ప్రకటనలో పేర్కొంది.

TFAPA భావోద్వేగ ప్రకటన..

దిగ్గజ దర్శకుడు, నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీరాజా మృతి పట్ల తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (TFAPA) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. జూన్ 10న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, భారతీయ చలనచిత్ర రంగాన్ని విప్లవాత్మకంగా మార్చిన అత్యంత ప్రభావవంతమైన సినీ వ్యక్తిత్వాల్లో భారతీరాజా ఒకరని కొనియాడింది.

2020లో భారతీరాజా ఆధ్వర్యంలో స్థాపించబడిన తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (TFAPA) ప్రస్తుతం 400 మందికి పైగా క్రియాశీల నిర్మాతలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణుల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేశారని అసోసియేషన్ పేర్కొంది.

సినిమా రంగానికి కొత్త తరాన్ని పరిచయం చేసిన గురువుగా, తమిళ సినీ పరిశ్రమ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా భారతీరాజా ఎప్పటికీ గుర్తుండిపోతారని TFAPA తన ప్రకటనలో నివాళులర్పించింది. "ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమలో ఓ స్వర్ణ అధ్యాయానికి ముగింపు. అయితే ఆయన వారసత్వం ఆయన సినిమాలు, ఆలోచనలు, స్ఫూర్తి పొందిన అనేక మంది ద్వారా చిరస్థాయిగా నిలిచిపోతుంది" అని తెలిపింది.