దేవుడా : తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు

దేవుడా : తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు

తమినాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 2023 డిసెంబర్ 18 సోమవారం రోజున పాలయంకోట్టైలో 26 సెం.మీ, కన్యాకుమారిలో 17 సెం.మీ నమోదైంది. ఈ కుండపోత వర్షాల నేపథ్యంలో తిరునల్వేలి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులు షెల్టర్ క్యాంపుల్లో తలదాచుకున్నారు.  ఈ కుండపోత వర్షాలతో జన జీవనం పూర్తిగా స్తంభించింది.  

తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, టెన్ కాశి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈ 4 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించింది.  

దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఎడతెరపి లేని వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రోడ్లపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. దక్షిణ తమిళనాడులోని జిల్లాలతో పాటు దక్షిణ కేరళ, లక్షద్వీప్ లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

దక్షిణ తమిళనాడులోని కన్యాకుమరి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెన్ కాశీ  జిల్లాల్లో నష్టం నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. స్టేట్  డిజాస్టర్  రెస్పాన్స్  ఫోర్స్  సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటుందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రమంతా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలంటున్నారు అధికారులు. 

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బాధిత కుటుంబాలకు రూ.6,000 వరద సహాయాన్ని ప్రారంభించారు. చెన్నై, తిరువళ్లూరు, చెంగెల్‌పేట్, కాంచీపురం జిల్లాల్లోని సుమారు 25 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే ఈ సహాయ చర్య కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,486.93 కోట్లు కేటాయించింది.