మోదీతో తమిళనాడు సీఎం విజయ్‌‌ భేటీ..సీఎం హోదాలో తొలిసారి ప్రధానితో సమావేశం

మోదీతో తమిళనాడు సీఎం  విజయ్‌‌ భేటీ..సీఎం హోదాలో తొలిసారి ప్రధానితో సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్  భేటీ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా బుధవారం ఢిల్లీ వచ్చిన విజయ్.. ప్రధాని అధికారిక నివాసం ‘సేవా తీర్థ్’లో మోదీని కలిశారు.

 రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ సమావేశం దాదాపు 25 నిమిషాల పాటు సాగింది. కేవలం మర్యాదపూర్వక భేటీగానే కాకుండా, తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండాగా చర్చలు చేసినట్టు సమాచారం. తమిళనాడుకు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, పన్నుల వాటా, అలాగే, రాష్ట్రంలో చేపట్టబోయే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర సహాయాన్ని విజయ్ కోరారు. 

ఇటీవల నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ‘అనైమంగళం’ రాగి శాసనాలను తిరిగి భారత్‌‌కు రప్పించడంలో ప్రధాని మోదీ చేసిన కృషికి  విజయ్‌‌ కృతజ్ఞతలు తెలిపినట్టు తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నది. అలాగే, మేకేదాటు డ్యామ్‌‌ వివాదం అంశంపైనా ప్రధానితో డిస్కస్‌‌ చేసినట్టు పేర్కొన్నది. 

తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేయడం, వేధించడంలాంటి ఘటనలు పెరుగుతుండటంపై సీఎం ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపింది. ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత విజయ్ ఢిల్లీలోని ‘తమిళనాడు హౌస్’కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించి, స్వాగతం పలికాయి.

మేకేదాటు ప్రాజెక్టుపై ఫైట్​: ప్రధానికి విజయ్ లేఖ

ఢిల్లీ పర్యటనకు ముందే, ప్రధాని మోదీకి మంగళవారం సీఎం విజయ్ ఒక అత్యవసర లేఖ రాశారు. కర్నాటక ప్రభుత్వం కావేరి నదిపై ప్రతిపాదించిన వివాదాస్పద ‘మేకేదాటు రిజర్వాయర్’ ప్రాజెక్టును తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టంచేశారు. ప్రధానితో జరిగి భేటీలోనూ 
ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం.