తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్

తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్

తమిళనాడు అసెంబ్లీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం సాధారణం. కానీ తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు. సీఎం స్టాలిన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ఆర్ఎన్ రవి  తమిళనాడు చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాశారని.. వాటిని సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు. తమిళనాడు ద్రవిడుల భూమి అన్న ప్రచారం జరిగిందని, తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలని చెప్పారు. దీనిపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. దీంతో ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు. ఇదే సమయంలో డీఎంకే మిత్రపక్ష ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వాకౌట్‌ చేసి అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు.

గవర్నర్ తన ప్రసంగంలో ఉద్దేశపూర్వకంగానే తమిళనాడు పదాన్ని పలకలేదని ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగం కాపీల్లో తమిళనాడు అని ఉన్నా.. గవర్నర్ ప్రస్తావించకపోవడంపై సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగంలో ఉన్న విషయాలను చదవకుండా తమిళనాడు ప్రజలను అవమానించారని మండిపడ్డారు. ప్రసంగంలో ఉన్న ద్రావిడ మోడల్, తమిళనాడు అన్న చోట గవర్నర్ ప్రత్యామ్నాయ పదాలను వాడారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని, గవర్నర్ ప్రసంగంలోని పలు అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ దాన్ని ఆమోదించింది.