
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం భయంలో ఉన్నారని.. మహారాష్ట్రలో జరిగిన పరిణామాల తర్వాత ఆయనకు నిద్ర పడుతుందో ? లేదో ?నని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. చాలా మంది షిండేలున్నారని బీజేపీ ప్రచారం చేస్తుందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎనిమిదేళ్లలో ఏ ఒక్క ప్రధాన డిమాండ్ కూడా నెరవేరలేదని, సంక్షేమ పథకాలు గట్టెక్కించే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో లేదన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోందని, ప్రజా సమస్యల గురించి ఏ పార్టీ కూడా మాట్లాడకుండా రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు, సభలు పెట్టుకొనే పరిస్థితి లేదన్నారు. ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రభావం తగ్గించడంలో కేసీఆర్ విజయం సాధించారని తెలిపారు.
ఇటీవలే సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు హనుమకొండలో జరిగిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు విజయ రాఘవన్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం హాజరయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగిన నేపథ్యంలో క్యాడర్ లో జవసత్వాలు నింపేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పట్టున్న స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవాలన్న పట్టుదలతో నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పార్టీ కీలక నేతలు పిలుపునిచ్చారు.