తండా స్కూళ్లకు మూసివేత దెబ్బ

తండా స్కూళ్లకు మూసివేత దెబ్బ

విద్యాశాఖ కార్యదర్శి మౌఖిక ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఆయా స్కూళ్లలోని స్టూడెంట్లను వేరే బడులకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బడుల మూసివేతకు కసరత్తు జరుగుతోందన్న దానిపై ‘వెలుగు’ పత్రిక గత నెలలోనే కథనం ప్రచురించింది. సర్కారు తీరుపై స్టూడెంట్లు, టీచర్స్​ యూనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో బడులను మూసివేయడం లేదని అధికారులు ప్రకటించారు. అయితే సర్కారు మళ్లీ రేషనలైజేషన్​ పని మొదలుపెట్టింది. ఇది అమలైతే మెజార్టీ తండాలు, గిరిజన గూడాల్లోని సర్కారు స్కూళ్లు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాలుగు వేల స్కూళ్లు మూత!

రాష్ట్రంలో మొత్తం 25,131 సర్కారీ స్కూళ్లు నడుస్తున్నాయి. పీఏబీ అనుమతి ఉన్న స్కూళ్లు మరో రెండు వేల వరకు ఉంటాయి. మొత్తంగా నాలుగైదు వేల స్కూళ్లు ఒక్క టీచర్​తోనో, అసలు టీచర్లు లేకుండానో కొనసాగుతున్నాయి. అయితే గ్రామానికో సర్కారు స్కూల్‌ ను మాత్రమే కొనసాగించాలని, తక్కువ స్టూడెంట్లున్న బడులను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో రాష్ట్ర సర్కారు ఆ దిశగా చర్యలు చేపడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 15 మందిలోపు స్టూడెంట్లున్న ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లు 3,445, హైస్కూళ్లు 22 ఉన్నాయి. 20, 30 మంది లోపు ఉన్నవి మరో 500 వరకు ఉంటాయని అంచనా. అంటే సుమారు నాలుగు వేల స్కూళ్లను మూసివేసే పరిస్థితి ఉండనుంది. సర్కారు స్కూళ్లలో బడిబాట కార్యక్రమం పూర్తయి, అడ్మిషన్లు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో బడుల్లో స్టూడెంట్ల లెక్కలపై త్వరలో పూర్తి స్పష్టత రానుంది. ఆ లెక్కల ఆధారంగా రేషనలైజేషన్​ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

ఆర్డర్లు జారీ చేస్తున్న డీఈవోలు

స్టూడెంట్ల రేషనలైజేషన్​కు సంబంధించి సంబంధించి సంగారెడ్డి, మెదక్‌ డీఈవోలు ఇంతకుముందే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా సోమవారం నాటికి తక్కువ ఎన్‌రోల్‌మెంట్‌ ఉన్న స్కూళ్ల వివరాలను అందించాలంటూ మహబూబాబాద్‌ జిల్లా డీఈవో సత్యప్రియ ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. మిగతా జిల్లాల్లోనూ ఇప్పటికే అంతర్గతంగా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. బడులను ఏ ప్రతిపాదికన రీలొకేట్‌ చేయాలనే దానిపై వారం క్రితం డీఈవోలతో జరిగిన రివ్యూ మీటింగ్‌లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ మరోసారి సూచనలు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు డీఈవోలు, ఇతర అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ ఏడాది 99 స్కూళ్లలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌ నమోదైంది. 10 మందిలోపు స్టూడెంట్లున్న ప్రైమరీ బడులు వంద వరకు ఉన్నాయి.

‘మూసివేత’ కోసం రాజస్థాన్‌ కు..

స్కూళ్ల మూసివేతకు సంబంధించి ఎలాంటి విధానం అనుసరించాలన్న దానిపై అధికారుల బృందం ఇటీవలే రాజస్థాన్​లో పర్యటించి వచ్చింది. రాజస్థాన్​లో మూడేండ్ల కింద సుమారు 18 వేల సర్కారీ స్కూళ్లను మూసేశారు. ఈ విషయంలో అక్కడి అధికారులు అనుసరించిన విధానాన్ని తెలుసుకునేందుకు అధికారులు రాజస్థాన్​కు వెళ్లి వచ్చారు. దీనిపై సర్కారుకు త్వరలోనే నివేదిక ఇవ్వనున్నట్టు తెలిసింది.