మరో వివాదంలో తాండూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్

మరో వివాదంలో తాండూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్
  •     చేవెళ్ల ఉద్యోగి వచ్చి, ఇక్కడి రికార్డులు పరిశీలించడంపై సందేహాలు

తాండూరు, వెలుగు: తాండూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మరో వివాదంలో చిక్కుకుంది. ఇక్కడికి డిప్యుటేషన్​పై వచ్చి, తిరిగి చేవెళ్ల కార్యాలయానికి వెళ్లిన ఉద్యోగి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం తాండూర్ ఆఫీస్​కు రావడం, ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌తో కలిసి కొన్ని కీలక రికార్డులను పరిశీలించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఏ అవసరంతో వచ్చారనే విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

రికార్డులు పరిశీలించినట్లు సమాచారం అందడంతో కొందరు మీడియా ప్రతినిధులు తాండూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్​కు చేరుకొని, ఇన్​చార్జి సబ్ రిజిస్ట్రార్​పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటీవల వివిధ రిజిస్ట్రేషన్​చార్జీల పెంపుపై ప్రజల నుంచి, డాక్యుమెంట్ రైటర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోందని, ఈ పెంపు వెనక చేవెళ్ల ఉద్యోగి పాత్ర ఉందా అని ప్రశ్నించగా.. సమాధానం చెప్పలేదు. అదే సమయంలో చేవెళ్ల ఉద్యోగి శ్రీనివాస్ యాదవ్ అక్కడి నుంచి ముఖానికి మాస్కు ధరించి, హడావుడిగా బయటకు పరిగెత్తాడు. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించాలని స్థానికులు కోరుతున్నారు.