గంజాయి స్మగ్లింగ్ కేసు.. భారత సంతతి వ్యక్తికి సింగపూర్​లో ఉరి

గంజాయి స్మగ్లింగ్ కేసు.. భారత సంతతి వ్యక్తికి సింగపూర్​లో ఉరి
  • కిలో గంజాయిని తరలిస్తూ 2014లో తంగరాజు అరెస్టు
  • అతడిపై నేరం నిరూపితమైందన్న అక్కడి హోం మంత్రిత్వ శాఖ
  • ఆగ్రహం వ్యక్తం చేసిన యునైటెడ్ నేషన్స్, మానవ హక్కుల సంఘాలు
  • గంజాయి స్మగ్లింగ్ కేసులో శిక్ష అమలు చేసిన ప్రభుత్వం
  • ఆగ్రహం వ్యక్తం చేసిన యునైటెడ్ నేషన్స్, మానవ హక్కుల సంఘాలు

సింగపూర్: గంజాయి స్మగ్లింగ్ కేసులో భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య(46)కు సింగపూర్ ప్రభుత్వం బుధవారం ఉరిశిక్ష అమలు చేసింది. అతనితోపాటు అతని కుటుంబం, మానవ హక్కుల కార్యకర్తలు, యునైటెడ్ నేషన్స్​ క్షమాభిక్ష కోరినప్పటికీ సర్కారు వినిపించుకోలేదు. కోర్టులో తుది విచారణ ముగిసిన ఒకరోజు తర్వాత తంగరాజును చాంగి జైలు కాంప్లెక్స్​లో ఉరి తీసినట్లు సింగపూర్ ప్రిజన్ సర్వీస్  అధికారులు ప్రకటించారు. అతని మరణ ధ్రువీకరణ పత్రం అందిందని తంగరాజు సోదరి లీలావతి సుప్పయ్య తెలిపారు. తంగరాజు చేసిన నేరం నిరూపితమైందని సింగపూర్​ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతకుముందే పేర్కొంది. డ్రగ్స్ సప్లయ్​కి అతను రెండు ఫోన్​లను వాడినట్లు పోలీసులు నిర్ధారించారు. తన కేసును సమీక్షించి, ఉరిశిక్ష నిలిపివేయాలని తంగరాజు చేసిన తుది విజ్ఞప్తిని సింగపూర్ కోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ కేసును పున:సమీక్షించేందుకు, ఉరిని ఆపేందుకు కావాల్సిన న్యాయమైన ప్రతిపాదనలను చూపడంలో తంగరాజు విఫలమయ్యారని జస్టిస్ చోంగ్ తన తీర్పులో వెల్లడించారు. 

కిలో గంజాయి స్మగ్లింగ్ చేసిండని కేసు.. 

సింగపూర్​లో ఉంటున్న భారత సంతతికి చెందిన తంగరాజు 2014లో అరెస్ట్ అయ్యాడు. ఒక కిలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నాడని కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన సింగపూర్ కోర్టు 2018 అక్టోబర్ 9న తంగరాజును దోషిగా తేల్చింది. ఇంకో ఇద్దరితో కలిసి గంజాయి రవాణా కు సహకరించాడని నిర్ధారిస్తూ అతడికి మరణ శిక్ష విధించింది. అయితే, హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా ఈ కేసు విచారణ జరగలేదని జెనీవాకు చెందిన గ్లోబల్ కమిషన్ ఆన్ డ్రగ్ పాలసీ సభ్యుడు రిచర్డ్ తన బ్లాగ్​లో ఇటీవల ఆరోపించారు. తంగరాజును అరెస్ట్ చేస్తున్నప్పుడు డ్రగ్స్ ఎక్కడా లేవని, ఆ దేశం ఓ అమాయకుడి ప్రాణాలు తీయబోతోందని పేర్కొన్నారు. దీంతో ఇంటర్​నేషనల్ సంఘాల నుంచి కూడా సింగపూర్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఈయూ, ఆస్ట్రేలియా దేశాలు సైతం తంగరాజకు మద్దతుగా నిలిచాయి. ఈయూ సభ్య దేశాలు, నార్వే, స్విట్జర్లాండ్ దేశాలు కలిసి ఓ ప్రకటన విడుదల చేశాయి. తంగరాజు ఉరి శిక్షను నాన్  కేపిటల్ శిక్షగా మార్చాలని కోరాయి. జీవించే హక్కును గౌరవించాలని కోరాయి.

చట్ట ప్రకారమే నడుచుకున్నం: సింగపూర్

రిచర్డ్ ప్రకటనపై స్పందించిన సింగపూర్ హోం మంత్రిత్వ శాఖ.. ఆయన కామెంట్లు తమ దేశ న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉన్నాయని మండిపడింది. డ్రగ్స్ కు సంబంధించి స్థానిక చట్టాల ప్రకారమే ఉరి అమలు చేస్తున్నామని ప్రకటించింది.