టీఎన్జీవో సిటీ కమిటీ ఎన్నిక రద్దు

టీఎన్జీవో సిటీ కమిటీ ఎన్నిక రద్దు

హైదరాబాద్, వెలుగు: టీఎన్జీవో హైదరాబాద్ సిటీ కమిటీ ఎన్నికను రద్దు చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నిక లేకుండా ఈఏడాది జనవరిలో  కొత్త అధ్యక్ష, సెక్రటరీ లుగా శ్రీకాంత్, హరికృష్ణలను టీఎన్జీవో కేంద్ర సంఘం నియమించిందని పాత అధ్యక్షుడు శ్రీరామ్ సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ వేశారు. ఈఏడాది మార్చి వరకు తమ టర్మ్ ఉందని, అది పూర్తయ్యాక కూడా 6 నెలలు అడహక్ కమిటీ నియామకం ఉంటుందని, ఎలాంటి కారణం లేకుండా పాత కమిటీని కేంద్ర సంఘం నేతలు రద్దు చేసిందని పిటీషన్ లో పేర్కొన్నారు. 

ఈ కేసులో ప్రతివాదులుగా కొత్త అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, హరికృష్ణ, టీఎన్జీవో కేంద్ర సంఘం జనరల్ సెక్రటరీ మారం జగదీశ్వర్, ఎలక్షన్ ఆఫీసర్ గా వ్యవహరించిన రాజీవ్ చంద్ లను చేర్చారు.  4 నెలలుగా వాదనలు జరగ్గా శనివారం 32 పేజీల్లో మధ్యంతర తీర్పును సిటీ సివిల్ కోర్డు సీనియర్ జడ్జి వెల్లడించారు. యథావిధిగా పాత కమిటీ అధ్యక్షుడిగా శ్రీరామ్ కొనసాగుతారని, కొత్త కమిటీ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు తీర్పుపై శ్రీరామ్ తో పాటు టీఎన్జీవో సిటీ యూనిట్ నేతలు విఠల్ బాబుతో పాటు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని నాంపల్లి సిటీ ఆఫీస్ లో పటాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. 

కోర్టులో సవాల్ చేస్తం: శ్రీకాంత్, హరికృష్ణ

సిటీ యూనియన్ కమిటీని రద్దు చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పు మధ్యంతరం అని, ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదని సిటీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీరామ్, హరికృష్ణ తెలిపారు. సమ్మర్ హాలిడేస్ పూర్తి కాగానే ఈ జడ్జిమెంట్ ను సవాల్ చేస్తామని స్పష్టంచేశారు.  జడ్జిమెంట్ లో ఎక్కడ కూడా శ్రీకాంత్ , హరిక్రిష్ణలను అధ్యక్ష, కార్యదర్శిగా ఉండరాదని తెలుపలేదన్నారు. కోర్టు ఉత్తర్వులను తప్పుగా ప్రచారం చేసుకోవడం సబబు కాదన్నారు.