భారత్‎పై సుంకాలు విధించినంత మాత్రాన పుతిన్ ఆగడు: ట్రంప్ నిర్ణయంపై డెమొక్రాట్ ప్యానెల్ విమర్శలు

భారత్‎పై సుంకాలు విధించినంత మాత్రాన పుతిన్ ఆగడు: ట్రంప్ నిర్ణయంపై డెమొక్రాట్ ప్యానెల్ విమర్శలు

వాషింగ్టన్: ఉక్రెయిన్‎తో యుద్ధం ఆపేలా రష్యాను అరికట్టడానికి భారత్‎పై సుంకాలు విధించిన ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా హౌస్ విదేశాంగ కమిటీ డెమోక్రటిక్ ప్యానెల్ తీవ్రంగా విమర్శించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న సాకుతో భారత్‎పై ట్రంప్ 50 శాతం అదనపు సుంకాలు విధించినంత మాత్రాన పుతిన్ ఆగడని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి ఈ చర్య పెద్దగా ఉపయోగపడదని అభిప్రాయపడింది డెమొక్రాట్ ప్యానెల్. 

‘‘రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తుందన్న కారణంతో భారత్‎పై సుంకాలు విధించడం వల్ల పుతిన్ ఆగడు. ఉక్రెయిన్‌పై రష్యా అక్రమ దండయాత్రను ట్రంప్ నిజంగా ఆపాలనుకుంటే.. ట్రంప్ నేరుగా రష్యాపై చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఉక్రెయిన్‌కు అవసరమైన సైనిక సహాయం అందించాలి. అంతేకానీ రష్యాకు ముకుతాడు వేయడానికి భారత్‎పై సుంకాలు విధించడం వంటి చర్యలన్నీ వేస్ట్’’ అని ట్రంప్ నిర్ణయాన్ని విమర్శించింది డెమొక్రాట్ ప్యానెల్. ట్రంప్-పుతిన్ అలస్కా భేటీ విషలమైతే భారత్‎పై మరికొన్ని అదనపు సుంకాలు విధిస్తామన్న అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరికల తర్వాత డెమోక్రటిక్ ప్యానెల్ పై విధంగా స్పందించింది. 

మూడేళ్లుగా సాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రష్యాకు అడ్డుకట్ట వేయడానికి ఆ దేశంతో వాణిజ్యం చేయొద్దని పలు దేశాలను హెచ్చరించారు ట్రంప్. అయినప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. ఈ చర్యలతో తీవ్ర ఆగ్రహానికి గురైన ట్రంప్ భారత్ పై 50 శాతం అదనపు సుంకాలు విధించాడు. అలస్కాలో జరిగే భేటీలో యుద్ధం ఆపడానికి పుతిన్ అంగీకరించకపోతే భారత్ పై మరికొన్ని అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. అయితే, ఈ భేటీ సానుకూలంగా జరగడంతో భారత్‎పై అదనపు సుంకాల వడ్డింపు నిర్ణయాన్ని ట్రంప్ విరమించుకున్నట్లు తెలుస్తోంది.