- ప్రమాణ స్వీకారం చేయించిన ప్రెసిడెంట్
- 35 ఏండ్ల తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పురుషుడిగా రికార్డు
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) చీఫ్ తారిఖ్ రెహ్మాన్(60) ప్రమాణం చేశారు. మంగళవారం ఢాకాలోని జాతీయ పార్లమెంటు (జాతీయ సంసద్) సౌత్ ప్లాజాలోని బహిరంగ ప్రదేశంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. తారిఖ్ రెహ్మాన్‌తో ప్రెసిడెంట్ మహమ్మద్ షాబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రధానమంత్రితోపాటు 25 మంది మంత్రులు, 24 మంది రాష్ట్ర మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ కొత్త మంత్రివర్గంలో ఇద్దరు మైనారిటీ కమ్యూనిటీ సభ్యులకు చోటు లభించింది. మునుపటి మధ్యంతర ప్రభుత్వ భద్రతా సలహాదారు ఖలీలుర్ రెహ్మాన్‌ను టెక్నోక్రాట్ మంత్రిగా చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ ఉన్నత రాజకీయ, సైనిక ప్రముఖులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భారత ప్రతినిధులుగా ఈ వేడుకకు హాజరయ్యారు.
కాగా, ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన జమాత్ -ఏ-ఇస్లామీతోపాటు యూనస్ ఆశీస్సులున్న నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాయి. సంప్రదాయబద్ధంగా జరిగే ‘బంగాభవన్’లో కాకుండా సౌత్ ప్లాజాలో ఈ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం.
ఐదేండ్లపాటు బాధ్యతలు..
సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీని విజయపథంలో నడిపించిన రెహ్మాన్.. ప్రధానమంత్రిగా ఐదేండ్ల పాటు బాధ్యతలు నిర్వహించనున్నారు. ‘‘చట్టానికి లోబడి ప్రభుత్వ ప్రధానమంత్రిగా నా విధులను విశ్వాసపాత్రంగా నిర్వహిస్తాను” అని ఆయన ప్రమాణం చేశారు. మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన తారిఖ్ రెహ్మాన్.. 17 ఏండ్ల ప్రవాసం తర్వాత గత డిసెంబర్‌లో లండన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు.
బంగ్లాదేశ్‌లో గత 35 ఏండ్లుగా మహిళలే ప్రధానులుగా కొనసాగారు. ఇన్నేండ్ల తర్వాత పురుష ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ నిలిచారు. ప్రమాణ స్వీకారం అనంతరం రెహ్మాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, సుపరిపాలన అందించడమే తమ ముందున్న ప్రధాన సవాళ్లని ఆయన స్పష్టం చేశారు.
రెహ్మాన్‌తో ఓంబిర్లా భేటీ
ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి భారత్తరఫున హాజరైన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో తారిఖ్ రెహ్మాన్ భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత అభినందన లేఖను ఓం బిర్లా ఆయనకు అందజేశారు. ఈ వివరాలను భారత్‌లో బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా ఎక్స్‌లో పంచుకున్నారు. భారత్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, రెహ్మాన్‌ను భారత్ లో పర్యటించాల్సిందిగా ఓం బిర్లా ఆహ్వానించారు.
