
హోబర్ట్: పేసర్ తస్కిన్ అహ్మద్ (4/25) కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ బోణీ చేసింది. సోమవారం జరిగిన సూపర్–12, గ్రూప్–2 మ్యాచ్‌లో 9 రన్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో 144/8 స్కోరు చేసింది. అఫిఫ్ హుసేన్ (38), నజ్ముల్ హుసేన్ (25), మెసద్దెక్ హుసేన్ (20 నాటౌట్) రాణించారు. డచ్ బౌలర్లలో మీకెరెన్, లీడె చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 135 రన్స్‌కే పరిమితమైంది. కొలిన్ అక్రెమన్ (62) హాఫ్ సెంచరీతో రాణించినా మిగతా వారు విఫలమయ్యారు. చివర్లో మీకెరెన్ (24) వేగంగా ఆడినా ప్రయోజనం లేకపోయింది. తస్కిన్, హసన్ (2/15) దెబ్బకు 8 మంది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. తస్కిన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
సౌతాఫ్రికా–జింబాబ్వే మ్యాచ్ రద్దు
సౌతాఫ్రికా–జింబాబ్వే మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. వాన అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 79/5 స్కోరు చేసింది. మదెవీర (35 నాటౌట్), షుంబా (18) రాణించారు. చకబ్వా (8), ఎర్విన్ (2), సీన్ విలియమ్స్ (1) ఫెయిలయ్యారు. సఫారీ బౌలర్లలో ఎంగిడి 2, పార్నెల్, నోర్జ్ చెరో వికెట్ తీశారు. తర్వాత సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు వర్షం అడ్డుపడటంతో టార్గెట్‌ను 7 ఓవర్లలో 64 రన్స్‌కు కుదించారు. బరిలోకి దిగిన సఫారీ టీమ్ 3 ఓవర్లలో 51 రన్స్ చేసింది. డికాక్ (18 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 47 నాటౌట్) దంచికొట్టాడు. ఈ దశలో మరోసారి వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.