నష్టాలొచ్చినా ఎయిర్ లైన్ ను వదలని టాటా

నష్టాలొచ్చినా ఎయిర్ లైన్ ను వదలని టాటా
  • వారసత్వంగా భావిస్తున్నారన్న ఎనలిస్టులు
  • గతేడాది విస్తారా, ఎయిర్‌ ఏషియాల నష్టం రూ.6253 కోట్లు

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: విమానాలను నడపడమంటే టాటాలకు ఆసక్తి ఎక్కువ. ఈ ఇండస్ట్రీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నా ఎయిర్‌‌‌‌లైన్‌‌ బిజినెస్‌‌ను వదలాలని టాటా గ్రూప్‌‌ ఎప్పుడూ అనుకోలేదు. ఎయిర్ఏషియా ఇండియా, విస్తారాలను ప్రస్తుతం టాటా గ్రూప్‌‌ నడుపుతోంది. ఈ రెండు కంపెనీలలో టాటాలకు 51 శాతం చొప్పున వాటాలున్నాయి. ఈ రెండు కంపెనీలు కూడా కరోనా ముందు నుంచే నష్టాల్లో నడుస్తున్నాయి. కరోనా సంక్షోభం ఈ ఇండస్ట్రీపై మరింత దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. కానీ ఇలాంటి పరిస్థితులలో కూడా ఎయిర్‌‌‌‌లైన్‌‌ బిజినెస్‌‌ను వదిలేయాలని టాటాలు  అనుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ రంగ కంపెనీ ఎయిర్‌‌‌‌ఇండియాలో వాటాలు కొనాలని కూడా ఆలోచిస్తున్నారు. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్‌‌‌‌ఇండియాను అమ్మేయాలని గత కొన్నేళ్ల నుంచి  ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటి వరకు ఈ కంపెనీని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ, ఇప్పటి వరకు ఎయిర్‌‌‌‌లైన్ బిజినెస్‌‌లో సక్సెస్ అవ్వని టాటాలు  ఎయిర్‌‌‌‌ఇండియాను కొంటే మంచిదని ఎనలస్టులు  భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎయిర్‌‌‌‌ఇండియాను అమ్మడంలో రూల్స్‌‌ను ఎప్పటికప్పుడు సింపుల్‌‌ చేస్తోంది. టాటా గ్రూప్‌‌ కూడా ఈ కంపెనీని కొనేందుకు ప్రపోజల్స్‌‌ను రెడీ చేసిందని వార్తలొచ్చాయి. కానీ  బిడ్స్‌‌ వేసినట్టు ఇప్పటి వరకు వార్తలు రాలేదు.

నష్టాల్లోనే టాటా కంపెనీలన్నీ..

టీసీఎస్‌‌ మినహా టాటా గ్రూప్‌‌కు చెందిన కంపెనీలన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి.  2007 లో 13 బిలియన్‌‌ డాలర్లతో ఇంగ్లండ్‌‌ కంపెనీ కారస్‌‌ గ్రూప్‌‌ను కొన్న టాటా స్టీల్‌‌, తన యూకే బిజినెస్‌‌ను లాభాల్లోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 2.3 బిలియన్‌‌ డాలర్లతో జాగ్వార్‌‌‌‌ ల్యాండ్‌‌ రోవర్‌‌‌‌ను 2008 లో కొన్న టాటా మోటార్స్‌‌ కూడా కాంపిటీషన్‌‌ ఎక్కువగా ఉండడంతో నష్టపోతోంది. జపనీస్‌‌ కంపెనీ ఎన్‌‌టీటీ డొకొమాతో కలిసి స్టార్ట్‌‌ చేసిన టెలికాం బిజినెస్‌‌ కూడా టాటాలకు చేదు అనుభవమే ఇచ్చింది. ఈ రెండు కంపెనీల మధ్య ఏర్పడిన గొడవ 2017 లో కాని సెటిల్ కాలేదు. కంపెనీలన్నీ నష్టాల్లో ఉన్నా టాటాలు ఎయిర్‌‌‌‌లైన్ బిజినెస్‌‌లో ఎందుకు ఎంటర్‌‌‌‌ అయ్యారు? అంటే మాత్రం సమాధానం ఎవరికీ తెలియదు. రతన్ టాటా మైండ్‌‌ నుంచి ఎయిర్‌‌‌‌లైన్స్‌‌ను వేరు చేయలేమని, ఈ బిజినెస్‌‌ను ఆయనంత సులువుగా వదులుకోడని ఎనలిస్టులు అంటున్నారు.

నెట్టుకొస్తున్న కంపెనీలు..

కరోనా సంక్షోభంతో  ఎయిర్‌‌‌‌లైన్‌‌ బిజినెస్‌‌పై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడం లేదు. సీనియర్‌‌‌‌ ఇన్వెస్టర్‌‌‌‌ వారెన్ బఫెట్‌‌ కూడా తన పోర్టుఫోలియోలో ఉన్న  ఎయిర్‌‌‌‌లైన్‌‌ స్టాకులన్నింటినీ అమ్మేశారు. మిలియనీర్ కావాలనుకుంటే, బిలియన్‌‌ డాలర్లతో ఓ ఎయిర్‌‌‌‌లైన్‌‌ కంపెనీ స్టార్ట్‌‌ చేస్తే సరిపోతుందని బిజినెస్‌‌మెన్‌‌ రిచర్డ్‌‌ బ్రాన్సన్‌‌ చెప్పే కొటేషన్ ప్రస్తుతం సరిపోతుంది. టాటాలు ప్రస్తుతం నడుపుతున్న విస్తారా, ఎయిర్‌‌‌‌ఏషియా రెండూ కలిపి గత ఆర్థిక సంవత్సరంలో 845 మిలియన్‌‌ డాలర్ల(సుమారు రూ. 6,253 కోట్లు) నష్టాలను ప్రకటించాయి. రతన్‌‌ టాటా తర్వాత టాటా గ్రూప్‌‌కు చెర్మన్‌‌గా ఎన్నికైన సైరస్ మిస్త్రీకి ఎయిర్‌‌‌‌లైన్ బిజినెస్‌‌ అంటే ఇష్టపడేవాడు కాదని విశ్లేషకులు అన్నారు.  విదేశీ మేనేజ్‌‌మెంట్‌‌ చేతిలో విస్తారా, ఎయిర్‌‌‌‌ఏషియా నడుస్తోందని టాటా గ్రూప్‌‌ ఏవియేషన్ బిజినెస్‌‌కు చెందిన ఉద్యోగులు అన్నారు. ఇండియాకు తగ్గట్టు ఎయిర్‌‌‌‌లైన్ బిజినెస్‌‌ ఎలా చేయాలో వీరికి తెలియదని చెప్పారు. కంపెనీ లోకల్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌లయితే ప్రతి విషయానికి మలేషియా పార్టనర్‌‌‌‌ నుంచి ఆమోదం పొందాల్సి వచ్చేదని చెప్పారు. అవినీతి ఆరోపణలు రావడంతో 2018 లో కంపెనీలో టాటాల జోక్యం పెరిగింది. ఆ తర్వాత ఈ విధానంలో మార్పొచ్చిందని ఉద్యోగులు తెలిపారు. రతన్ టాటా మినహా మిగిలిన బోర్డు మెంబర్లకు ఏవియేషన్‌‌ బిజినెస్‌‌పై పెద్దగా పట్టులేదని, దీంతో ఈ కంపెనీలు లాభాల్లోకి రావడంలో విఫలమవుతున్నాయని చెప్పారు.

వారసత్వంగా ఎయిర్‌‌‌‌లైన్ బిజినెస్‌‌..

లెజండరీ ఇండస్ట్రీయలిస్ట్‌‌ జేఆర్‌‌‌‌డీ  టాటాకు ఇండియాలో మొదటి లైసెన్స్డ్ పైలెట్‌‌గా పేరుంది. ఆయన 1932 లో  టాటా ఎయిర్‌‌‌‌లైన్స్‌‌ను ప్రారంభించారు. బ్రిటీష్‌‌ పాలనలో ఉన్న అప్పటి ఇండియాలో ఆయన కరాచి-–ముంబైకి మధ్య విమానాన్ని నడిపారు. కానీ టాటా ఎయిర్‌‌‌‌లైన్‌‌ను నేషనలైజ్‌‌ చేయడంతో (ఇప్పటి ఎయిర్‌‌‌‌ ఇండియా) ప్రభుత్వం చేతికి ఈ కంపెనీ వెళ్లిపోయింది. టాటా గ్రూప్‌‌ మాజీ చైర్మన్‌‌ రతన్ టాటాకు కూడా విమానాలను నడపడమంటే ఆసక్తి ఎక్కువ. అతను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఇంజిన్‌‌లో సమస్య తలెత్తిన విమానాన్ని సక్సెస్‌‌ఫుల్‌‌గా ల్యాండ్ చేశారు. రతన్‌‌ టాటా  సూపర్‌‌‌‌ సోనిక్‌‌ ఎఫ్‌‌-16 ఫైటర్ జెట్‌‌ను కూడా నడిపారు. సింపుల్‌‌గా చెప్పాలంటే ఎయిర్‌‌‌‌లైన్ బిజినెస్‌‌ను ఒక వారసత్వంగా టాటా గ్రూప్‌‌ చూస్తోంది. ఎంత కష్టం వచ్చినా ఈ బిజినెస్‌‌ను నిలబెట్టాలని అనుకుంటోంది. ఎయిర్‌‌‌‌లైన్ బిజినెస్‌‌ను నడపడానికి ప్రైవేట్‌‌ కంపెనీలకు అవకాశం ఇచ్చినప్పటి నుంచి ఎయిర్‌‌‌‌లైన్ కంపెనీని ఏర్పాటు చేయాలని టాటాలు ప్రయత్నాలు చేశారు. మలేషియన్ కంపెనీ ఎయిర్‌‌‌‌ఏషియాతో కలిసి ఎయిర్‌‌‌‌ఏషియా ఇండియాను 2014 లో టాటా గ్రూప్‌‌ తీసుకొచ్చింది. సింగపూర్‌‌‌‌ కంపెనీతో కలిసి విస్తారాను 2015 లో ఏర్పాటు చేసింది.