
త్వరలో కొత్త ప్రొడక్ట్‌లొస్తాయ్..
అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం…
దేశ మార్కెట్‌లో ప్రస్తుతం నడుస్తోన్న స్లోడౌన్ ఎఫెక్ట్‌తో ఉద్యోగులెవరినీ తీసివేయడం లేదని టాటా మోటార్స్ స్పష్టం చేసింది. వర్క్‌ఫోర్స్‌ను తగ్గించడానికి టాటా మోటార్స్ చూడటం లేదని కంపెనీకి చెందిన టాప్ అధికారి చెప్పారు. వచ్చే కొన్ని నెలల్లో కొత్త ప్రొడక్ట్‌ల రాకతో, పరిస్థితులన్నీ చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టాటా మోటార్స్ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం, ఈ కంపెనీలో 83 వేల మంది పనిచేస్తున్నారు. దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నెలకొన్న స్లోడౌన్‌తో వర్క్‌ఫోర్స్ రేషనలైజ్(తగ్గించడానికి) చేయడానికి కంపెనీ చూస్తోందా? అనే ప్రశ్నకు సమాధానంగా అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని టాటా మోటార్స్ సీఈవో, ఎండీ గుంటెర్ బుట్షెక్ చెప్పారు. ఒకవేళ కంపెనీ అలాంటి నిర్ణయమేమైనా తీసుకోవాలనుకుంటే, ఇప్పటికే తీసుకుని ఉండేదని అన్నారు. 12 నెలలుగా తాము తీవ్ర సంక్షోభంలో ఉన్నామని గుర్తు చేశారు. వచ్చే కొన్ని నెలల్లో ఆల్ట్రోజ్, నెక్సాన్ ఈవీ, గ్రావిటస్ ఎస్‌యూవీ వంటి కొత్త ప్రొడక్ట్‌లను లాంచ్ చేయబోతున్నట్టు తెలిపారు. బీఎస్ 6 నిబంధనల్లోకి పూర్తిగా మారుతున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడేందుకు, రెవెన్యూ విషయంలో కంపెనీకి వెన్నుముకగా నిలుస్తోన్న కమర్షియల్ వెహికిల్ స్పేస్‌లో అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మంచి ప్రొడక్ట్‌లను తాము ఆఫర్ చేస్తున్నామని, తమ డీలర్ నెట్‌వర్క్ బాగుందని చెప్పారు. కాస్ట్ అప్టిమైజేషన్, క్వాలిటీ కంట్రోల్ చర్యలు వంటి అన్ని రకాల మెకానిజాలను కంపెనీ ఫాలో అవుతుందని తెలిపారు. వర్క్‌ఫోర్స్ రేషనలైజేషన్ ప్రస్తుతం అవసరం లేదన్నారు. 30 ఏళ్ల తన కెరీర్‌లో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇలాంటి సంక్షోభం మునుపెన్నడూ చూడలేదని గుంటెర్ చెప్పుకొచ్చారు. జూలై–సెప్టెంబర్ క్వార్టర్‌లో, కంపెనీ అమ్మకాలు 44 శాతం వరకు తగ్గిపోయి, రూ.1,281.97 కోట్ల నికర నష్టాలొచ్చాయి. అంతకుముందు ఏడాది కంపెనీ రూ.109.14 కోట్ల లాభాలను రికార్డు చేసింది.