- ఖర్చు రూ.9,451 నుంచి రూ.91కి తగ్గుదల
- టెస్టింగ్ టైమ్ 15 రోజుల నుంచి 5 రోజులకు తగ్గుదల
హైదరాబాద్, వెలుగు: డ్రోన్ల వినియోగం ద్వారా టీబీ టెస్టింగ్ఖర్చు, టైమ్‌ను గణనీయంగా తగ్గించొచ్చని తేలింది. రోగికి శ్రమ తగ్గడంతో పాటు జేబుకు చిల్లుపడే ప్రమాదమూ తగ్గుతుందని వెల్లడైంది. ‘ఐ డ్రోన్’ కార్యక్రమంలో భాగంగా బీబీ నగర్ఎయిమ్స్తో కలిసి ఇండియన్కౌన్సిల్ ఆఫ్ మెడికల్రీసెర్చ్ (ఐసీఎంఆర్) పైలెట్ ప్రాజెక్టు కింద యాదాద్రి భువనగిరి జిల్లాలో అధ్యయనం చేసింది. జిల్లాలోని11 ప్రైమరీ హెల్త్సెంటర్లు, 60 సబ్సెంటర్ల నుంచి రోగుల శాంపిళ్లను డ్రోన్ల ద్వారా టీబీ టెస్టింగ్సెంటర్లకు పంపించింది.
ఎంతో దూరంలో ఉండే టెస్టింగ్ సెంటర్లకు వచ్చే బదులుగా.. దగ్గర్లోని పీహెచ్‌సీల్లోనే రోగుల నుంచి శాంపిళ్లను సేకరించేలా చేసింది. ఆ శాంపిళ్లను డ్రోన్ల ద్వారా టెస్టింగ్ సెంటర్లకు తరలించింది. దీంతో రోగులకు అయ్యే ఖర్చు రూ.9,451 నుంచి రూ.91కి తగ్గిందని ఐసీఎంఆర్ గుర్తించింది. అదే సమయంలో 15 రోజుల్లో రావాల్సిన రిపోర్టులు కేవలం 5 రోజుల్లోనే వస్తున్నాయని వెల్లడైంది. దూరాలు ప్రయాణించే భారం కూడా రోగులకు తగ్గిందని తేలింది.
డ్రోన్ల ద్వారా శాంపిళ్లను సేకరించిన వారిలో 76.3 శాతం మందికి మర్నాడే రిపోర్టులు వచ్చాయని ఐసీఎంఆర్ గుర్తించింది. డ్రోన్లతో కాకుండా సాధారణంగా శాంపిళ్లు ఇచ్చిన వారిలో అది కేవలం 1.5 శాతమేనని తేల్చింది. గతంలో 92 శాతం మందికి రెండు రోజుల్లో రిపోర్టులు వస్తే.. ఇప్పుడు డ్రోన్ల ద్వారా అది కేవలం 16.3 శాతానికి తగ్గిందని గుర్తించింది. అంటే డ్రోన్ల ద్వారా టెస్టింగ్ టైంగానీ, ఖర్చుగానీ భారీగా తగ్గిందని ఐసీఎంఆర్ స్టడీ స్పష్టం చేసింది.
