హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) పరిధిని కేవలం నగరానికే పరిమితం చేయకుండా, తెలంగాణలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలకు విస్తరించాలని తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ (TCJAC) తీవ్రంగా డిమాండ్ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 23 హెచ్‌సీఏ కార్యదర్శికి కమిటీ ప్రత్యేకంగా ఒక ప్రెస్ నోట్ ద్వారా విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా టీసీజేఏసీ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014 జూన్ 2 నుంచి ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగుతోందని, అలాగే 2016-17 నాటికి రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటయ్యాయని గుర్తుచేసింది. రాష్ట్రపతి 2016-17లో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్రంలోని 33 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు హెచ్‌సీఏ అనుబంధం కల్పించాలని డిమాండ్ చేసింది.
గ్రామీణ ప్రాంతాల ఆటగాళ్లకు తీవ్ర అన్యాయం
ప్రస్తుతం హెచ్‌సీఏ అఫిలియేషన్ లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన క్రికెటర్లకు సరైన అవకాశాలు దక్కడం లేదని కమిటీ ఆరోపించింది. గ్రామాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసే వేదికలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య తీవ్ర అసమానతలు
తెలంగాణ జనాభాలో సుమారు 35 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, వారికి ఏకంగా 209 క్రికెట్ క్లబ్‌లు అందుబాటులో ఉన్నాయని టీసీజేఏసీ వెల్లడించింది. మరోవైపు, రాష్ట్రంలో 65 శాతం ఉన్న గ్రామీణ జనాభాకు కేవలం 8 క్లబ్‌లు మాత్రమే ఉండటం దారుణమని పేర్కొంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న ఈ స్పష్టమైన అసమానతలను వెంటనే తొలగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
ALSO READ : ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..
గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు సమాన అవకాశాలు కల్పించేలా కొత్త హెచ్‌సీఏ క్లబ్‌లను కేటాయించాలని, తెలంగాణ అంతటా క్రికెట్ క్రీడను అభివృద్ధి చేసేందుకు హెచ్‌సీఏ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని టీసీజేఏసీ విజ్ఞప్తి చేసింది.
