
ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతకు ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన టీసీఎస్ శుభవార్త చెప్పింది. 2024లో 40 వేల మంది ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ప్రకటించింది. ఇందు కోసం రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఐటీ రంగం అభివృద్ధి పథంలో పయనిస్తున్న చాలా దేశాల్లో ఇప్పటికే ఐటీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. లే ఆఫ్స్ తగ్గి రిక్రూట్ మెంట్స్ పెరిగాయి. దీంతో.. టీసీఎస్ కూడా ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసింది. ఒక్క జూన్ త్రైమాసికంలోనే టీసీఎస్ సంస్థ కొత్తగా 5,452 మందికి ఉద్యోగాలు కల్పించింది. దీంతో.. ప్రస్తుతం టీసీఎస్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరింది.
ఇదిలా ఉండగా ఇప్పటికే 70 శాతం మంది ఉద్యోగులను ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ విధానంలోకి తిరిగి తీసుకురావడంలో టీసీఎస్ సక్సెస్ అయింది. ఆఫీస్ కు వెళ్లి పనిచేసే ఉద్యోగులు కోరుకుంటే త్రైమాసిక బోనస్ లు కూడా ఇస్తామని టీసీఎస్ ప్రకటించడంతో ఎక్కువ మంది ఉద్యోగులు ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు 4.5 నుంచి 7 శాతం శాలరీ ఇంక్రిమెంట్స్ అమలు చేస్తున్నామని.. పనితీరులో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు 10 నుంచి 12 శాతం ఇంక్రిమెంట్ కూడా ఇచ్చినట్లు టీసీఎస్ తెలిపింది. టీసీఎస్ ఇటీవలే వేరియబుల్ పే పాలసీని అప్డేట్ చేసింది. ఆఫీస్ అటెండెన్స్ అంశాన్ని ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ఉద్యోగులకు స్పష్టం చేసింది. దీంతో.. మెజార్టీ టీసీఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం చేస్తున్న పరిస్థితి ఉంది.
Also Read:-ప్యూరిట్ బ్రాండ్ అమ్మేసిన హెచ్యూఎల్
టీసీఎస్ గుడ్ న్యూస్ చెప్తే ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన సేల్స్ ఫోర్స్ మాత్రం బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఖర్చులు తగ్గించుకునే ప్లాన్ లో భాగంగా జులై నెలలో 300 మందిని లేఆఫ్ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పని మొదలైనట్లు సమాచారం. 2024లో సేల్స్ ఫోర్స్ లేఆఫ్స్ ప్రకటించడం ఇది రెండోసారి. తాజా లేఆఫ్స్ గురించి సేల్స్ ఫోర్స్ ప్రతినిధి స్పందిస్తూ.. వ్యాపార కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించే ఏ సంస్థ అయినా లాభనష్టాలను బేరీజు వేసుకోవడం సహజం అని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించి కొన్నిసార్లు నియామకాలు, మరికొన్ని సందర్భాల్లో ఉద్యోగుల తొలగింపులు తప్పవని తెలిపారు.
సేల్స్ ఫోర్స్ గతేడాది కూడా లేఆఫ్స్ ప్రకటించింది. 2023 ఆరంభంలో 700 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ నిర్ణయం ద్వారా అప్పటికి మొత్తం వర్క్ ఫోర్స్ లో 10 శాతం తగ్గించుకుంది. ఉద్యోగులను తొలగిస్తూ సేల్స్ ఫోర్స్ లే-ఆఫ్స్ ప్రకటించడం వల్ల కంపెనీ షేర్లు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.