తెలంగాణలో టీడీపీ పోటీకి దూరం.. ఎవరికి లాభం?

తెలంగాణలో టీడీపీ పోటీకి దూరం.. ఎవరికి లాభం?
  • కాపు వర్గం ఓట్ల కోసం జనసేన గాలం
  • సీమాంధ్ర ఓటర్ల కోసం జనసేనతో బీజేపీ పొత్తుకు యత్నాలు
  • సెటిలర్లను ఆకట్టుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్లాన్లు

హైదరాబాద్‌, వెలుగు :  రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంటుందని అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా తెలంగాణలో టీడీపీని అభిమానించే ఓటర్లు ఉన్నట్లు గతంలోనే స్పష్టమైంది.  గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పార్టీ అభిమానులు ఉన్నారు. అయితే, మారిన రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీలకు షిఫ్ట్‌ అవుతున్నారు. తాజాగా టీడీపీ పోటీ చేయడం లేదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ పార్టీ ఓటింగ్‌ ఎవరికి లాభం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. 

కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ టీడీపీకి బలం..

రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదిన్నరేండ్లవుతున్నా టీడీపీ బలం ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో మిగిలే ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014  ఎన్నికల్లో టీడీపీ 15 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కొన్ని నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది.  ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు మినహా మిగతా వారంతా బీఆర్‌ఎస్‌ లో చేరారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. కానీ, సత్తుపల్లి ఎమ్మెల్యే  సండ్ర వెంకట వీరయ్య,  అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వర్‌ రావు బీఆర్‌ఎస్‌లో చేరారు.  

కాంగ్రెస్‌ వైపు కమ్మ సామాజికవర్గం..

ఇన్నాళ్లు టీడీపీకి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గం తాజా రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్‌ వైపు ఉండాలని నిర్ణయించింది.  ఇప్పటికే ఆ సామాజిక వర్గం నేతలు బాహాటంగానే కాంగ్రెస్‌ కు మద్దతు పలికారు. కమ్మ సంఘం ఇప్పటికే కాంగ్రెస్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ ఓటింగ్‌ కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కమ్మ నేతలు తుమ్మల నాగేశ్వర్‌రావు, మండవ వెంకటేశ్వర్‌రావులను పార్టీలో చేర్చుకుంది. ఆ సామాజిక వర్గం అత్యధికంగా ఉండే ఖమ్మం నియోజకవర్గం నుంచి తుమ్మలను ఎన్నికల బరిలో నిలిపింది. టీడీపీ అధినేత చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య సాన్నిహిత్యం ఇటీవల చంద్రబాబు అరెస్టును కాంగ్రెస్‌ పార్టీ ఖండించడం వంటి పరిణామాలతో టీడీపీ ఓటింగ్‌ కాంగ్రెస్‌కు మళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా గెలవడంలోనూ టీడీపీ ఓటింగ్‌ ఆయనకు సానుకూలంగా పని చేసిందనే వాదనలు ఉన్నాయి.  తాజాగా టీడీపీ..  ఓటింగ్‌కు దూరంగా ఉండడంలో కాంగ్రెస్‌ పార్టీ లాబీయింగ్‌ పని చేసిందనే వాదనలు ఉన్నాయి. 

టీడీపీతో పాటు సెటిలర్లపై బీఆర్‌ఎస్‌ నజర్​

బీఆర్‌ఎస్‌.. 2014 నుంచి టీడీపీ నేతలను పార్టీలోకి తీసుకుంటున్నది. 2018లో టీడీపీ సీనియర్లతో పాటు కీలక నేతలను చేర్చుకుంది. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను బీఆర్‌ఎస్‌లో చేర్చుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే కాసాని టీడీపీకీ రాజీనామా చేయడంతో  ఇది దాదాపు కీలకదశకు చేరుకుంది. టీడీపీతో పాటు సెటిలర్ల ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్‌ఎస్‌ ముందు నుంచే ప్రయత్నాలు చేస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్‌కి మంత్రి పదవి ఇవ్వడం.. మాగంటి గోపీనాథ్‌, అరికెలపూడి గాంధీ వంటి ఆ సామాజిక వర్గానికి గ్రేటర్‌లో ప్రాధాన్యం కల్పించింది. తాజాగా చంద్రబాబు అరెస్టు విషయంలో కేటీఆర్‌, కవితతో పాటు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌  చంద్రబాబుపై సానూభూతిని వ్యక్తం చేస్తూ లోకేష్‌కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ, సీమాంధ్ర ఓటర్లు ఏ పార్టీకి లాభం చేకూరుస్తారనేది వేచి చూడాల్సిందే..

టీడీపీ ఓట్లకు బీజేపీ గాలం..

తెలంగాణలో బీజేపీకి టీడీపీ అనుకూలంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకోకుండానే  ఆ పార్టీ  ఓటర్లను తమవైపునకు తిప్పుకుపే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలోనే ఏపీలో చంద్రబాబు అరెస్టు కావడం.. అనంతరం లోకేష్‌ను అమిత్‌షాతో కలిపించి.. బాబు అరెస్టులో తమ పాత్ర లేదనే సంకేతాలు ఇచ్చింది. లోకేష్‌.. అమిత్​షాను కలిసిన సందర్భంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు  కిషన్‌ రెడ్డి, ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ ఉండడంతో బీజేపీ.. టీడీపీకి అండగా ఉందనే సంకేతాలు ఇచ్చారు. ఎన్టీఆర్‌ స్టాంప్‌ విడుదల సందర్భంగా బీజేపీ వ్యూహాత్మకంగా ఎన్టీఆర్‌ అభిమానులను తమవైపునకు తిప్పుకునేందుకు సానుకూల సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణలో ఆ పార్టీ ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం కొనసాగుతోంది. అలాగే, జనసేనతో పొత్తు పెట్టుకోవడం ద్వారా సీమాంధ్ర ఓటర్లతో పాటు కాపు వర్గాన్ని సైతం తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది.