బీఆర్ఎస్​లోకి కాసాని జ్ఞానేశ్వర్​

బీఆర్ఎస్​లోకి కాసాని జ్ఞానేశ్వర్​

హైదరాబాద్, వెలుగు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్​ బీఆర్ఎస్​లో చేరారు. శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్​లో బీఆర్ఎస్ ​అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాసానితో పాటు ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈటల రాజేందర్ వెళ్లినా అంతకంటే పెద్ద నాయకులు పార్టీలోకి వచ్చారని తెలిపారు.“ఈ రోజు చాలా సంతోషంగా ఉంది.. కాసాని జ్ఞానేశ్వర్ నాకు పాత మిత్రుడు, ఎప్పుడో రావాల్సింది కాస్త లేటైందని” అన్నారు.

 రానున్న రోజుల్లో ముదిరాజ్ నాయకులకు చాలా అవకాశాలు కల్పిస్తామన్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు ఇలా ఎన్నో పదవుల్లో అవకాశం కల్పిస్తామన్నారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో కాసాని వీరేశ్, ముప్పిడి గోపాల్, ప్రకాశ్, వెంకటేశ్ ముదిరాజ్, సపన్​దేవ్, భిక్షపతి, కనకయ్య, శ్రీకాంత్, రమేశ్, చంద్రహాస్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద తదితరులు పాల్గొన్నారు.