ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడి..విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడి..విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

హైదరాబాద్, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. శనివారం మీడియా సమావేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై మాట్లాడుతూ రమేశ్ చేసిన విమర్శలు అధికార పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. 

దాంతో విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. ఇంటి ముందున్న ఫ్లెక్సీలను చించివేసి, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం ఇంటి లోపలికి ప్రవేశించి ఫర్నిచర్‌‌కు నిప్పు పెట్టారు. ఇంట్లో  మంటలు వ్యాపించడంతో ఆ ఏరియాలో దట్టమైన పొగ అలుముకున్నది. ఘటన సమయంలో ఇంట్లో రమేశ్ భార్య, కొడుకు, తండ్రి ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.

 వైసీపీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ తరహా ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ ఘటనపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో "జంగిల్ రాజ్" (అరాచక పాలన) సాగుతోందని, ప్రశ్నించే గొంతుకలను భౌతిక దాడులతో అణచివేయాలని చూస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.