పసుపుమయంగా ఖమ్మం

పసుపుమయంగా ఖమ్మం

టీడీపీ సభకు భారీగా తరలివచ్చిన జనం
క్యాడర్​లో జోష్​ నింపిన బాబు ప్రసంగం

ఖమ్మం/ ఖమ్మం టౌన్​, వెలుగు : ఖమ్మంలోని సర్దార్ పటేల్​ స్టేడియంలో బుధవారం జరిగిన టీడీపీ ‘శంఖారావం’ బహిరంగ సభ.. ఆ పార్టీ క్యాడర్​లో జోష్​ నింపింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రావడంతో కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. సభాప్రాంగణం, పరిసర ప్రాంతాలు పార్టీ కార్యకర్తలతో కిక్కిరిశాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా​ తరలివచ్చారు. స్టేడియం నిండి చాలా మంది రోడ్లపైనే నిలిచిపోవడంతో అక్కడ ఏర్పాటుచేసిన బిగ్​ స్క్రీన్లపై చంద్రబాబు ప్రసంగాన్ని చూశారు. 

భారీ ర్యాలీ.. 
వరంగల్ క్రాస్​ రోడ్​ నుంచి బైక్​ ర్యాలీతో చంద్రబాబుకు వెల్ కమ్​ చెప్పారు. అక్కడి నుంచి కాల్వొడ్డు, మయూరి సెంటర్​, జడ్పీ సెంటర్​, ఇల్లందు క్రాస్​ రోడ్​ మీదుగా సభావేదిక సర్దార్​ పటేల్ స్టేడియానికి చేరుకున్నారు. గిరిజన నృత్యాలు, కొమ్ము డ్యాన్సులు, భారీ వాహన శ్రేణి, కార్యకర్తలతో రోడ్లు నిండాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి జీవన్​ కుమార్​, ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి చంద్రహాస్​, జిల్లా ప్రధాన కార్యదర్శి కేతినేని హరీశ్​ పాల్గొన్నారు. 

బీఆర్ఎస్ వీఆర్​ఎస్​ తీసుకోవడమే..
తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఇకపై వీఆర్ఎస్ తీసుకోవడమేనని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ.. తెలంగాణలో తెలుగుదేశం నిర్వీర్యం అయిందనే వారికి ఈ సభ చెంప పెట్టు అన్నారు.ఈ బహిరంగ సభకు వచ్చిన ప్రజానికాన్ని చూసి కేసీఆర్ కు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ఖమ్మంలో 10కి 10 సీట్లు టీడీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.