బెల్లంపల్లిరూరల్,వెలుగు: కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్సిమెంట్ కంపెనీ అనుబంధ స్కూల్ దయానంద్ఆంగ్లో వేదిక్(డీఏవీ) లోనిసమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓ టీచర్ టవర్ ఎక్కడం ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం ఉదయం స్కూల్ కు చెందిన పీఈటీ ఎలుక శ్రీనివాస్ సిమెంట్ కంపెనీ గేట్ ఎదుట ఉన్న సెల్ టవర్‌పైకి ఎక్కి సమస్యలు పరిష్కారించే వరకూ కిందికి దిగేదిలేదని స్పష్టం చేశారు. స్కూల్ విద్యార్థులు, ఓరియంట్ కార్మికులు, గ్రామస్తులు, టీచర్లు, బీజేపీ లీడర్లు ఆయనకు మద్దతు తెలిపారు.
30 ఏళ్లుగా...
ఓరియంట్ సిమెంట్ కంపెనీ యాజమాన్యం ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా కార్మెల్ గిరి హైస్కూల్నడిపించింది. స్కూల్‌ను గత ఏడాది ఆగస్టులో డీఏవీ యాజమాన్యానికి అప్పగించింది. దానికి ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు రాలేదు. దీంతో కార్మెల్ గిరి స్కూల్ అనుమతులు, పాత సిబ్బందితో స్కూల్‌ను నడిపిస్తున్నారు. అయితే ఇందులో డీఏవీ యాజమాన్యం 15 మంది సిబ్బందిని నియమించుకోగా కార్మెల్‌గిరి పాఠశాలకు సంబంధించిన 35 మంది పాత టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. కార్మెల్ గిరి హైస్కూల్‌కు సంబంధించిన వేతన బకాయిలతో పాటు కొత్త యాజమాన్యం ఇవ్వాల్సిన రెండు నెలల జీతాలు చెల్లించాలని, శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని, కొత్త పీఆర్సీ అమలు, గ్రాట్యూటీ అమలు తదితర డిమాండ్ల కోసం 38 మంది టీచర్లు పలుమార్లు స్కూల్ యాజమాన్యం, ఓరియంట్కంపెనీ, జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ పాత సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురిచేస్తూ వేతనాలు ఇవ్వడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా ఓరియంట్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని, సమస్య పరిష్కరించేవరకూ టవర్ దిగనని శనివారం పీఈటీ శ్రీనివాస్ సెల్ టవర్ ఎక్కాడు. ఆయనకు మద్దతుగా విద్యార్థులు, కార్మికులు, గ్రామస్తులు, టీచర్లు కంపెనీ గేటు ఎదుట ఆందోళనకు దిగారు.
ఒక దశలో విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు పంపించకుండా తాళాలు వేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న మందమర్రి సీఐ ప్రమోద్‌రావు, దేవాపూర్, కాసీపేట ఎస్సైలు విజేందర్, గంగరాం, డివిజన్ పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.సాయంత్రం ఆందోళనకారులను పోలీసులు లాగివేసే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా.. పోలీసులు కఠినంగా వ్యవహరించడం సరికాదంటూ విద్యార్థులు, టీచర్లు కంటతడి పెట్టారు. టవర్ ఎక్కిన శ్రీనివాస్, మద్దతుగా నిలిచిన విద్యార్థులు, గ్రామస్తులు, కార్మికులు, టీచర్లు రాత్రి వరకూ ఆందోళన కొనసాగిస్తున్నారు. సాయంత్రం బీజేపీ నియోజకవర్గ నాయకుడు కొయ్యాల ఏమాజీ ఆధ్వర్యంలో లీడర్లు సంఘటన స్థలానికి చేరుకొని ధర్నా చేపట్టారు. యాజమాన్యం కుట్రలో భాగంగానే వేధిస్తున్నారని, సమస్యలు పరిష్కరించి 35 మంది టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
