317 జీవోపై సుప్రీంకు!

317 జీవోపై సుప్రీంకు!
  • సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు
  • రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా జీవో తెచ్చారని ఆందోళన
  • కొత్త పోస్ట్​లో చేరకపోతే చర్యలు తీసుకోనున్న సర్కారు!

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 317 జీవోపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 1975కు విరుద్ధంగా దీన్ని అమలు చేస్తున్నారని, స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని ఉద్యోగులను విభజిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విధానం వల్ల స్థానికులు ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా లోకల్ ఉద్యోగి నాన్ లోకల్ అవుతున్నారని అంటున్నారు. జీవో ను సవరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నా రాష్ట్ర సర్కారు పట్టించుకోకపోవటంతో చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. 

మరో వైపు కేటాయించిన పోస్టులో ఉద్యోగి చేరకపోతే నోటీసు ఇచ్చి చర్యలు తీసుకునేందుకు సర్కారు రెడీ అవుతున్నది.అప్పుడు కమల్ నాథన్ కమిటీ ఈజీగా చేసింది. రాష్ట్ర విభజన టైమ్ లో ఉద్యోగుల విభజనకు కేంద్ర ప్రభుత్వం కమల్​నాథన్ కమిటీని ఏర్పాటు చేసింది. అప్పుడు ఎలాంటి వివాదాలు లేకుండా కమిటీ విభజించిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నో తప్పులు చేస్తున్నదని ఉద్యోగులు అంటున్నారు. “కమల్​నాథన్​ కమిటీ ఉద్యోగులను విభజించే సమయంలో అందరి అభిప్రాయాలను తీసుకున్నది. సీనియారిటీ, స్థానికత విషయంలో క్లారిటీ ఇచ్చి విభజించింది. విడో, దివ్యాంగులు, స్పౌజ్  వంటి అంశాలలో క్లారిటీ ఇచ్చింది.  ఎన్నో అంశాలను కమిటీ రిపోర్ట్​లో పేర్కొంది. ఇప్పుడు పరిపాలన అవసరం కోసం కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, కొత్త పోస్టులను క్రియేట్ చేయలేదు. క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ చేయలేదు. ఉద్యోగులు, టీచర్ల నుంచి ఆప్షన్లు తీసుకుంది. ఉద్యోగుల కేటాయింపుల్లో చాలా అన్యాయం జరిగింది. 4 పోస్టులు ఉన్న జిల్లాల్లో 10 మందికి పోస్టింగ్ ఇచ్చారు. జీవోలో ఎన్నో లోపాలు ఉన్నాయి. జీవో ను సవరించాలని ఎన్నో డిమాండ్లు వస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటున్నం” అని ఉద్యోగ సంఘం నేత ఒకరు చెప్పారు.