న్యాయం చేయాలంటూ ప్రగతి భవన్ ముట్టడికి టీచర్ల యత్నం

న్యాయం చేయాలంటూ ప్రగతి భవన్ ముట్టడికి టీచర్ల యత్నం

బషీర్ బాగ్, వెలుగు: న్యాయం చేయాలంటూ జీవో 317 బాధిత టీచర్లు ఆదివారం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. 317 జీవో కారణంగా తాము స్థానికత కోల్పోయామని, తమ బాధను సీఎం కేసీఆర్ కు తెలియజేసేందుకు వచ్చామని బాధితులు చెప్పారు. సీఎంను కలిసేందుకు అనుమతివ్వాలని వేడుకున్నారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. దీంతో బాధితులు అక్కడే రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. వివిధ కారణాలతో పోలీసులు వారిని విడిచిపెట్టలేదు. తీరా చీకటి పడిన తరువాత 7 గంటల సమయంలో వెళ్లిపోవాలని చెప్పారు. 

ఈ సమయంలో తాము వెళ్లబోమని, తమకు ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వస్తేనే వెళ్తామని టీచర్లు అన్నారు. ‘ఇక్కడి నుంచి వెళ్లకపోతే కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తాం’ అని పోలీసులు హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక టీచర్లు రాత్రి 9 గంటలకు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. కాగా, టీచర్ల అక్రమ అరెస్టును యూటీఎఫ్, తపస్ సంఘాలు ఖండించాయి. మహిళలను, చిన్న పిల్లలను రాత్రి వరకు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం అన్యాయమని మండిపడ్డాయి. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. 

సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలి.. 

ప్రభుత్వం సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి, తమకు న్యాయం చేయాలని బాధిత టీచర్లు డిమాండ్ చేశారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ కు వినతిపత్రం ఇచ్చేందుకే ప్రగతి భవన్ కు వచ్చామని చెప్పారు.