పిల్లల్లో దేశభక్తి భావాలు పెంచడంలో టీచర్లదే కీలకపాత్ర : ఏవీఎన్ రెడ్డి

పిల్లల్లో  దేశభక్తి  భావాలు పెంచడంలో  టీచర్లదే కీలకపాత్ర :  ఏవీఎన్ రెడ్డి

హైదరాబాద్/రంగారెడ్డి,వెలుగు: స్టూడెంట్లలో నైతిక విలువలు, దేశభక్తి భావాలు పెంపొందించడంలో టీచర్ల పాత్ర కీలకమనీ టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. ఘట్​కేసర్ లోని అన్నోజిగూడలో రెండ్రోజులుగా జరుగుతున్న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ... దేశ ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో ఉన్నత వ్యక్తిత్వం గల స్టూడెంట్లను తయారుచేయాలని టీచర్లను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యంగా ఉందన్నారు. విద్యారంగంలో పలు ఖాళీలు భర్తీకాకుండా అనేక ఏండ్లుగా పెండింగ్​లో ఉన్నాయని చెప్పారు. 

బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో న్యాయపరమైన వివాదాలు తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. మన ఊరు– మన బడి స్కీమ్ కు ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి స్కూల్ లో స్కావెంజర్ ను నియమించాలన్నారు. కార్యక్రమంలో ఏవీఆర్​ఎస్​ఎం జాతీయ సహా సంఘటన కార్యదర్శి గుంత లక్ష్మణ్,  తపస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేష్, ఏబీఆర్​ఎస్​ఎం ప్రతినిధులు పాలేటి వెంకట్రావు, విష్ణువర్ధన్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.