- 5న జరిగే చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించిన టీచర్ల జేఏసీ
హైదరాబాద్, వెలుగు: ఇన్ సర్వీస్ టీచర్లకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీచర్ల సంఘాలు ఫిబ్రవరి 5న ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. గురువారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ స్టేట్ ఆఫీసులో 35 టీచర్ల సంఘాలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను ఆయా సంఘాల నేతలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీయూ, టీపీటీఎఫ్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి, చావ రవి, సదానందగౌడ్, అనిల్ కుమార్ మాట్లాడుతూ.. విద్యారంగంలోని సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ జాతీయ ఉపాధ్యాయ ఫెడరేషన్ల పిలుపు మేరకు వచ్చే నెల5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైమరీ స్కూల్ టీచర్లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు.
టీచర్ల జేఏసీ ఏర్పాటు..
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నాన్చుడు ధోరణిపై టీచర్ల సంఘాలు మండిపడ్డాయి. గురువారం 35 సంఘాలు సమావేశమై జేఏసీగా ఏర్పడ్డాయి. చలో ఢిల్లీ కార్యక్రమం పూర్తయ్యాక స్టీరింగ్ కమిటీ వేసుకోవాలని నేతలు నిర్ణయించారు. కార్యక్రమంలో టీచర్ల సంఘాల నేతలు భిక్షంగౌడ్, గజేందర్, సోమయ్య, లింగారెడ్డి, తిరుపతి, కటకం రమేశ్, వెంకట్, జాడి రాజన్న తదితరులు పాల్గొన్నారు.
