
అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 317 జీవో ఎంతో మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులను స్థానికత కోల్పోయేలా చేసిందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్‌తో ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాలకు చెందిన టీచర్లు ఆదివారం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. టీచర్లు భవన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా టీచర్లు శివ, పృథ్వీ మాట్లాడారు.
317 జీవో కారణంగా టీచర్లు తమ సొంత జిల్లా వదిలి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి దూరంగా ఉంటూ ఎంతో మంది మనోవేదన పడుతున్నారని, కొందరు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. తమను సొంత జిల్లాలకు ట్రాన్స్ ఫర్ చేయాలని కోరారు. ముట్టడిలో ఆదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన కవిత, అభిలాష్ తమ ఏడాదిన్నర బిడ్డతో కలిసి పాల్గొన్నారు. టీచర్లను పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో ఆ పాప ఏడ్వడం చూసి ఓ మహిళా హోంగార్డు ఆ చిన్నారిని దగ్గరకు తీసుకున్నారు. టీచర్ల అరెస్ట్ పూర్తయ్యేదాకా పాపను ఎత్తుకుని ఓదార్చారు. కాగా, తోపులాటలో పలువురు టీచర్లకు గాయాలయ్యాయి.