టీచర్ల అలకేషన్​ ఆగమాగం

టీచర్ల అలకేషన్​ ఆగమాగం
  • టీచర్ల అలకేషన్ ఆగమాగం
  • ఇష్టమున్నట్టు కానిచ్చేస్తున్న సర్కారు
  • ఒక్కో జిల్లాలో ఒక్కో తీరుగా సీనియారిటీ లిస్టుల తయారీ  
  • లిస్టులు ప్రకటించకముందే టీచర్ల నుంచి ఆప్షన్లు 
  • కేటాయింపు​పై ఒక్క సర్క్యూలరన్నా ఇవ్వని ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​
  • పోస్టింగ్​లు ఎట్లిస్తరో, ఎప్పుడిస్తరో ఎవరి దగ్గరా క్లారిటీ లేదు
  • టీచర్లలో అనేక సందేహాలు

హైదరాబాద్, వెలుగు: జిల్లాలకు టీచర్ల కేటాయింపు గందరగోళంగా తయారైంది. ఒక్కో జిల్లాలో ఒక్కోరకంగా సీనియారిటీని లెక్కగడుతున్నారు. ప్రాసెస్​ను ఆన్​లైన్​లో నిర్వహిస్తామని అంతా రెడీ చేసి.. ఆఫ్​లైన్​లోకి తీసుకువచ్చారు. సీనియారిటీ లిస్టులు ప్రకటించకుండానే, టీచర్ల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. లిస్టులు రిలీజ్​ చేశాక కనీసం ఎడిట్​ ఆప్షన్లకు కూడా చాన్స్​ ఇవ్వలేదు. పోస్టింగ్​లు ఎట్లిస్తరు..? ఎప్పుడిస్తరు..?  అనే ప్రశ్నలపై ఏ ఒక్క అధికారి వద్ద కూడా క్లారిటీ లేదు. అలకేషన్​  ఎలా నిర్వహించాలనే దానిపై ఇప్పటివరకు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక్క సర్క్యూలరన్నా విడుదల కాలేదు. జీఏడీ ఇచ్చిన గైడ్​లైన్స్​నే ఫాలో కావాలని చెప్తున్నారు. సందేహాలు, అనుమానాలను తీర్చేందుకు కనీసం హెల్ప్​డెస్క్ కూడా పెట్టలేదు. లక్ష మందికి పైగా టీచర్ల భవిష్యత్తుకు సంబంధించిన ఈ వ్యవహారాన్ని  పది పదిహేను రోజుల్లోనే పూర్తి చేయాలని చెప్పడంతో తామూ ఏమీ చేయలేకపోతున్నామని ఆఫీసర్లు కూడా అంటున్నారు. ఏదైనా తప్పు జరిగితే తమను బలిచేస్తారని, సాధారణ బదిలీలకు నెలల తరబడి టైం ఇచ్చే సర్కారు ఇంత పెద్ద ప్రాసెస్​ను తక్కువ టైంలో పూర్తి చేయాలని చెప్పడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 

జిల్లా కేడర్​ పరిధిలో 1.05 లక్షల మంది టీచర్లు
సర్కారు స్కూళ్లలో 1.24 లక్షలకు పైగా టీచింగ్ పోస్టుల శాంక్షన్ ఉండగా, వాటిలో 1.10 లక్షల మంది టీచర్లు, హెడ్మాస్టర్లు  పనిచేస్తున్నారు. నాన్​టీచింగ్​ స్టాఫ్​  పోస్టులు 10 వేల వరకు శాంక్షన్ ఉండగా, 4 వేల మంది పనిచేస్తున్నారు. ఆయా పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులుగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు విభజించారు. ఈ లెక్కన టీచర్ పోస్టుల్లో 1.05 లక్షల మంది జిల్లా కేడర్​ పరిధిలోకి వచ్చారు. ఇటీవల సర్కారు జిల్లాలవారీగా అలకేషన్​పై ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ముందుగా ఆప్షన్లను తీసుకున్నారు. మిగిలిన జిల్లాల్లో సోమవారంతో కోడ్ తొలగిపోతుండటంతో, ఈనెల 16 వరకు ఆప్షన్​ ఫారాలు ఇచ్చుకోవచ్చని సర్కారు సోమవారం స్పష్టం చేసింది. కొన్ని చోట్ల మాత్రం మంగళవారం ఒక్కరోజే ఆప్షన్ ఫారాల స్వీకరణకు డీఈఓలు చాన్స్​ ఇచ్చినట్లు తెలుస్తున్నది. 

సీనియారిటీ లిస్టులు లేకుండానే.. 
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8న సీనియారిటీ లిస్టులు ప్రకటించిన తర్వాత, 9న టీచర్ల నుంచి ఆప్షన్లు సేకరించాలి. 15న కొత్త జిల్లాల అలాట్​మెంట్​ ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. కానీ సీనియారిటీ లిస్టులు ప్రకటించకుండానే, టీచర్ల నుంచి బలవంతంగా ఆప్షన్ ఫారాలను తీసుకున్నారు. ఆప్షన్లు పెట్టిన రెండు, మూడు రోజులకు సీనియారిటీ లిస్టుల డ్రాఫ్టులను డీఈఓలు రిలీజ్ చేశారు. కనీసం లిస్టులు ప్రకటించిన తర్వాత ఎడిట్ ఆప్షన్లకు కూడా చాన్స్ ఇవ్వడం లేదని టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్నికల కోడ్ తొలగినందున ఆప్షన్ల ప్రక్రియను ఈ నెల16కు పెంచుతూ.. అలాట్​మెంట్​ ప్రొసీడింగ్స్​ను ఈనెల 20 పెంచుతూ సర్కారు సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఇది అన్ని జిల్లాలకు వర్తిస్తుందా..? తాజాగా కోడ్​ తొలగిన జిల్లాలకే వర్తిస్తుందా..? అన్నదానిపై క్లారిటీ లేదు.  

పోస్టింగ్​లు ఎట్లిస్తరు..? 
ఈనెల 20న జిల్లాలకు ఎంప్లాయీస్, టీచర్లను అలకేషన్​ చేయాలని అన్ని డిపార్ట్​మెంట్లకు సర్కారు ఆదేశాలు జారీచేసింది. కొత్త జిల్లాల అలకేషన్​పై ఇప్పటి వరకు స్పష్టమైన గైడ్​లైన్స్ విడుదల కాలేదు. దీంతో కొత్త జిల్లాలకు అలాటైన వెంటనే, ఆ టీచర్లను స్కూళ్లకు కేటాయిస్తారా.. లేక, ఈ అకడమిక్  ఇయర్ పూర్తయ్యే వరకూ పాత జిల్లాల్లోనే కొనసాగిస్తారా..? అనేదానిపై క్లారిటీ కరువైంది. ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల్లోనే అలాటైతే వారిని పాత స్కూల్​లోనే కొనసాగిస్తారా..? లేక కొత్త స్కూల్​కు పంపిస్తారా..? అనే అనుమానాలు టీచర్లలో ఉన్నాయి. కొత్త జిల్లాలకు అలాటైన తర్వాత ఎస్సీ, ఎస్టీ టీచర్ల రోస్టర్ పాయింట్లను ఎట్ల లెక్క గడతారు అనే దానిపైనా సందేహాలు నెలకొన్నాయి. టీచర్ల సందేహాలను తీర్చేందుకు కనీసం స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు హెల్ప్​ లైన్ సెంటర్​ను గానీ, హెల్ప్​ డెస్క్​ను గానీ ఏర్పాటు చేయలేదు. 

ఆన్​లైన్​ కు రెడీ చేసి.. ఆఫ్​ లైన్​లోకి..!
టీచర్ల అలకేషన్​ ప్రక్రియను ఆన్​లైన్​లోనే చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు భావించారు. దీనికోసం సాఫ్ట్ వేర్ రెడీ చేశారు. ఏమైందో కానీ సర్కారు నుంచి ఆన్​లైన్ ​వద్దని, ఆఫ్​లైన్​లోనే నిర్వహించాలని ఆదేశాలు అందడంతో ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్​లోనే ప్రాసెస్ నిర్వహిస్తున్నారు. ఆఫ్​లైన్‌‌‌‌‌‌‌‌లో అక్రమాలు జరిగేందుకు చాన్స్‌‌‌‌‌‌‌‌లున్నాయని అధికారులే చెప్తున్నారు. 

మినిస్టర్  మీటింగ్ ఉత్తుత్తుదే..!
జిల్లాల అలకేషన్​పై టీచర్ల సంఘాలతో సోమవారం విద్యాశాఖ మంత్రి సబిత సమావేశం నిర్వహించారు. టీచర్లకున్న అనేక సందేశాలను సంఘాల నేతలు ఈ మీటింగ్​లో ఏకరువు పెట్టారు. సీనియారిటీ లిస్టులు ఇవ్వకుండా ఆప్షన్లు ఎట్లా తీసుకున్నారని ప్రశ్నించారు. కనీసం ఎడిట్ ఆప్షన్ అయినా ఇవ్వాలని కోరారు. మరోపక్క సీనియారిటీతో పాటు లొకాలిటీని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అన్నీ విన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి చివరికి తన చేతుల్లో ఏమీ లేదని  చెప్పినట్లు సమాచారం. గీయింతదానికి మీటింగ్ పెట్టి ఏం ఉపయోగమని టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. 

అబ్జర్వర్ల నియామకం 
జిల్లాల అలకేషన్ ప్రాసెస్​ కోసం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు అబ్జర్వర్లను నియమించారు. నల్గొండకు సత్యనారాయణరెడ్డి (ఎగ్జామినేషన్ డైరెక్టర్),  ఖమ్మంకు కృష్ణారావు(సైట్ డైరెక్టర్), మెదక్​కు రమణకుమార్ (గురుకులాల సొసైటీ సెక్రెటరీ), ఆదిలాబాద్​కు శ్రీనివాసచారి (టెక్ట్స్​బుక్స్ డైరెక్టర్), కరీంనగర్​కు రాజీవ్ (ఎస్​ఎస్​ఏ జేడీ), వరంగల్​కు కె.సత్యనారాయణరెడ్డి(ఆర్జేడీ వరంగల్​),  రంగారెడ్డికి మదన్​మోహన్ (జేడీ సర్వీసెస్), మహబూబ్​నగర్​కు వెంకటనర్సమ్మ (ఎస్​ఎస్​ఏ జేడీ), నిజామాబాద్ కు విజయలక్ష్మి(ఆర్​జేఈ హైదరాబాద్​)ని నియమించారు.

డీఎస్​ఈల మెరిట్​ లిస్టులు లేవట!
వాస్తవానికి ఒకే డీఎస్ఈలో రిక్రూట్​అయిన టీచర్లకు ఆ ఎగ్జామ్​లో వచ్చిన మెరిట్ ర్యాంకుల ఆధారంగా సీనియారిటీని కేటాయించాలి. కానీ డీఎస్ఈ  మెరిట్ లిస్టులు లేవనే సాకుతో డేటాఫ్  జాయినింగ్, డేటాఫ్  బర్త్ ను చూసి సీనియారిటీని ఇచ్చారు. రూల్స్​ ప్రకారం అన్ని డీఎస్ఈల మెరిట్ లిస్టులను వెబ్ సైట్​లో పెట్టాలి. కానీ విద్యాశాఖ అధికారులు తమ వద్ద ఆ డేటా లేదని చేతులెత్తేశారు. దీంతో చాలామంది మెరిట్ టీచర్లు సీనియారిటీని కోల్పోతున్నారు. 

మెడికల్ సర్టిఫికెట్లు వెరిఫై చేయకుండానే...
అలకేషన్​లో సీనియారిటీతో సంబంధం లేకుండా.. ప్రత్యేక కేటగిరీల్లో 70%, ఆపై డిజెబిలిటీ ఉన్న దివ్యాంగులకు, సంతానంలో మనోవైకల్యం ఉన్న ఎంప్లాయీస్​కు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇంపార్టెన్స్​ ఇవ్వనున్నట్టు సర్కారు ప్రకటించింది. అయితే కొందరు తప్పుడు మెడికల్ రిపోర్టులు పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో జనరల్ ట్రాన్స్​ఫర్ల సమయంలోనే  టీచర్లు పెట్టిన సర్టిఫికెట్లను హెల్త్​ ఆఫీసర్లకు పంపించి వెరిఫై చేయించేవారు. కానీ ఇప్పుడవేవీ పట్టించుకోవడం లేదు. అలకేషన్లకు టైం లేకపోవడంతోనే ఓకే చేస్తున్నట్లు కొందరు ఆఫీసర్లు అంటున్నారు. 


స్పష్టమైన గైడ్​లైన్స్​ ఇవ్వాలి
అలకేషన్​ ప్రక్రియలో టీచర్ల అభ్యంతరాలను సర్కారు పట్టించుకోవడం లేదు. విద్యాశాఖ మంత్రితో టీచర్ల సంఘాల మీటింగ్​సందర్భంగా వచ్చిన సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త జిల్లాలకు అలాట్మెంట్ ఎలా చేస్తారనే దానిపై స్పష్టమైన గైడ్​లైన్స్ ఇవ్వాలి.  దామాషా పద్ధతిలో కొత్త జిల్లాలకు పోస్టులు, ఖాళీలను కేటాయించాలి. పారదర్శకంగా ప్రాసెస్​ నిర్వహించాలి. 
- చావ రవి, యూటీఎఫ్​ స్టేట్ జనరల్ సెక్రెటరీ 

హడావుడిగా చేస్తున్నరు
అలకేషన్ ప్రాసెస్ అంతా హడావుడిగా చేస్తున్నారు. లక్షమందికి పైగా టీచర్లకు సంబంధించిన ఈ వ్యవహారంలో  సర్కారు దుందుడుకు చర్యలు సరికావు. పీహెచ్, మెడికల్ సర్టిఫికెట్లపై కనీసం వెరిఫై కూడా చేయడం లేదు. స్పౌజ్ కేసుల విషయంలోనూ క్లారిటీ ఇవ్వడం లేదు. 
- సదానందంగౌడ్, ఎస్టీయూ​ స్టేట్ ప్రెసిడెంట్