కొత్త జీవోపై టీచర్ల ఆందోళన

కొత్త జీవోపై టీచర్ల ఆందోళన

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల కోసం సర్కారు రిలీజ్ చేసిన కొత్త జీవోపై టీచర్లు పెదవి విరుస్తున్నారు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు సర్కారు ఓకే చెప్పినందుకు ఆనందపడాలో లేక దాంట్లో ఉన్న రూల్స్ చూసి ఆందోళన పడాలో తెలియని స్థితిలో పరిస్థితి. ప్రమోషన్లు వచ్చే టైమ్లో సర్వీస్ మొత్తం వదులుకోవాలంటే టీచర్లు వెనుకడుగు వేస్తున్నారు. సర్వీస్ కావాలా.. లొకాలిటీ కావాలా అంటే ఎలా అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. స్టేట్ లో లోకల్ కేడర్ అలాట్ మెంట్ లో వేల మంది టీచర్లు తమ లొకాలిటీని కోల్పోయారు. సొంత జిల్లాలకు కేటాయించాలని వారంతా టీచర్ యూనియన్లతో కలిసి ఇంకా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల డిమాండ్ ముందుకొచ్చింది. దీంతో సర్కారు మ్యూచువల్ బదిలీలకు ఓకే చెప్తూ ఫిబ్రవరి 2న జీవో నెంబర్ 21 రిలీజ్ చేసింది. జీవోలోని నిబంధనలు చాలా టీచర్లను ఇబ్బందులకు గురిచేసేలా ఉండటంతో, మ్యూచువల్ బదిలీలకు వెళ్లాలా వద్దా అనేదానిపై ఆలోచనలో పడ్డారు. జీవో 317 ఎఫెక్ట్తో పాటు గతంలోనూ ఇతర జిల్లాల్లో పని చేస్తున్న టీచర్లు సుమారు 15 వేల మంది వరకూ ఉంటారు. వీరందరికీ సేమ్ కేడర్, సబ్జెక్ట్, మీడియం దొరకడం కష్టం. ఇలా దొరికిన వారికి జీవోలోని అంశాలతో వెనక్కి తగ్గుతున్నారని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. 

సర్వీస్ కోల్పోతే ప్రమోషన్ పోయినట్టే

ఉమ్మడి ఏపీలో 2012లో చివరిసారి  మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు జరిగాయి. అప్పటి నుంచి టీచర్లు ఎన్నిసార్లు సర్కారు పెద్దలకు విన్నవించినా, హామీలిచ్చిర్రు గానీ వాటిని అమలు చేయలేదు. తెలంగాణ సర్కారు ఇటీవల ఇచ్చిన జీవో ప్రకారం మ్యూచువల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ ఫర్లలో వచ్చిన టీచర్లు తమ సర్వీస్ను కోల్పోయి, ఆ జిల్లాలో జూనియర్ కేడర్గా మారిపోతారు. మరోపక్క జీవో 317తో ఒకరు ఎఫెక్ట్ అయి ఉండాలనే రూల్ నూ మార్చాలని కోరుతున్నారు. మార్చి 1 నుంచి 15 వరకూ ఆన్ లైన్ అప్లికేషన్లు తీసుకుంటామని సర్కారు ప్రకటించింది. ఇది కేవలం జూనియర్లకు, రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న వారికి మాత్రమే ఉపయోగపడుతుందని టీచర్ యూనియన్లు చెబుతున్నాయి. వెంటనే వీటిని మార్చాలని కోరుతున్నారు.  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన జైపాల్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్జీటీగా చేరారు. ఆయనకు 14 ఏండ్ల సర్వీస్ ఉంది. ప్రస్తుతం ప్రమోషన్ లిస్టులో ఉన్నారు. ఇటీవల ఆయన సొంత జిల్లా వికారాబాద్ జిల్లాకు మ్యూచువల్ కు వెళ్లాలని భావించారు. కానీ సొంత జిల్లాకు వెళ్తే సర్వీస్ మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. దీంతో భవిష్యత్లో ఆయనకు ప్రమోషన్ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఆయన మ్యూచువల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ ఫర్ ఆలోచన నుంచి వెనక్కి తగ్గారు.