టీచర్లకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక

టీచర్లకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక

టీచర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి కానుక ఇచ్చారు. ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పాదర్శకంగా బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు కేజీబీవీ, మోడల్ స్కూళ్లలోనూ బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రులకు ధన్యవాదాలు తెలిపాయి.

ఉదయం ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావును కలిశారు. వారితో టీచర్ల బదిలీలు, పదోన్నతులపై చర్చించారు. ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అనంతరం ఉపాధ్యాయుల బదిలీలను ప్రమోషన్లను ఓ నెలరోజుల్లో  పూర్తి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీ  పోస్టులను ప్రస్తుతం  కామన్ సీనియారిటీ(960 ఖాళీలను అందరితో) భర్తీ చేస్తామని, కోర్టు తీర్పు అనంతరం అప్గ్రేడేషన్ పోస్టులు  భర్తీ చేయనున్నట్లు చెప్పారు. బదిలీలు ప్రమోషన్లు ఇప్పుడు జరిగినప్పటికీ  టీచర్లు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగుతారని, చివరి వర్కింగ్ డే రోజున వారిని రిలీవ్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే మార్చిలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలపై నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వస్తున్నాయి. 317జీవో రద్దు చేయాలంటూ టీచర్లు ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నారు. అయినా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలను పిలిచి ప్రకటన చేయడం రాజకీయ లబ్ది కోసమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.