ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్/కడెం,వెలుగు: జిల్లాలోని టీచర్లు ఆన్​లైన్​లో హాజరును లైవ్ లోకేషన్ ద్వారా షేర్​ చేయాలని కలెక్టర్ ముషారఫ్​ అలీ ఫారూఖీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ లోకేషన్ ను పర్యవేక్షించారు. బాసర, భైంసా, సోన్, లోకేశ్వరం, కడెం, దస్తురాబాద్ మండలాల హెచ్ఎంలు, టీచర్లతో వీడియోకాల్​చేసి మాట్లాడారు. పాఠశాలల పరిసరాలు, సిబ్బంది గది, తరగతి గదులను పర్యవేక్షించారు. సోన్ మండలం మాదాపూర్ పాఠశాలలో నిర్వహిస్తున్న సీజనల్ హెల్త్​క్యాంప్ పరిశీలించారు. అంతకుముందు కలెక్టర్​ ముషారఫ్​ అలీ ఫారూఖీ కడెం, దస్తురాబాద్​ మండలాల్లో పర్యటించారు. పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈవో  రవీందర్ రెడ్డి , ఆఫీసర్లు భోజన్న, రాజేశ్వర్, ప్రవీణ్ కుమార్, రవి పాల్గొన్నారు.

వెల్ఫేర్​ హాస్టళ్లలో సౌకర్యాలు లేవు

ఆసిఫాబాద్,వెలుగు: వెల్ఫేర్​హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్​ అయ్యిందని, విద్యార్థులు చనిపోతున్నా.. పట్టించుకోవడంలేదని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక్​ విజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం ఆయన వాంకిడిలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యార్థులు చనిపోతున్నారని, దీనికి ప్రభుత్వమే పూర్తిబాధ్యత వహించాలన్నారు. సమావేశంలో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కోవ విజయ్, మండల అధ్యక్షుడు కొట్నాక రాంషావ్, లీడర్లు ఉయిక రాము, సోయం మాన్కు,కనక ప్రకాశ్, ఆత్రం సాయినాథ్, సర్పంచ్ రాజయ్య  తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీలకు అండగా ఉంటాం

బెల్లంపల్లి రూరల్,వెలుగు: ఆదివాసీలకు పోలీసులు ఎప్పుడు అండగా ఉంటారని మంచిర్యాల ఇన్​చార్జి డీసీపీ అఖిల్​మహాజన్​ తెలిపారు. శుక్రవారం కాసిపేట మండలం కోలాంగూడలో 300 మంది ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం మావోయిస్టులకు సహకరించవద్దని పోస్టర్​రిలీజ్​చేశారు. గిరిజనులు చదువుకొని ఎదగాలని, ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంసాఘిక శక్తులకు ఆశ్రయం కల్పించవద్దన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్, మందమర్రి సీఐ ప్రమోద్​రావు, దేవాపూర్ ఎస్సై విజయేందర్​తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేసిన్రు

బెల్లంపల్లి,వెలుగు: కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేసిందని కానిస్టేబుల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం సామాజిక కార్యకర్త మాదరి రాకేశ్, అభ్యర్థులు డి. శ్రీనివాస్ నాయక్, వి.శీరిష, బి. అభిశేక్, ఆర్.శ్వేత మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో రాజ్యాంగం కల్పించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్​ను పాటించలేదన్నారు. పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు 30, బీసీలకు 35 శాతం రిజర్వేషన్లు అమలుచేయాల్సి ఉండగా, బీసీలకు మాత్రమే అమలు చేసి ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం చేశారన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

రుణ లక్ష్యం సాధించాలి : కలెక్టర్​ 

మంచిర్యాల, వెలుగు:  2022-–23 ఆర్థిక సంవత్సర రుణ లక్ష్యాలను బ్యాంకర్లు సాధించాలని కలెక్టర్​ భారతి హోళికేరి ఆదేశించారు. ఈ ఏడాది జిల్లా రుణ లక్ష్యం రూ.4 వేల 295 కోట్లుగా నిర్ధారించామన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, లీడ్ బ్యాంక్ ఆఫీసర్​ మహిపాల్​రెడ్డితో బ్యాంకర్లతో రివ్యూ నిర్వహించారు. స్వల్పకాలిక రుణాలు రూ.వేయి 951 కోట్లు, వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలు రూ.952 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రుణాలు రూ.687 కోట్లు, వ్యవసాయ రుణాలు రూ.120 కోట్లు, ప్రాధాన్యత రంగ గృహ రుణాలకు రూ.237 కోట్లు, మొత్తం ప్రాధాన్యతా రంగాలకు రూ.3 వేల 996 కోట్లు లక్ష్యమని తెలిపారు. డీఆర్దీఓ బి.శేషాద్రి, ఆర్​బీఐ ఏజీఎం రాజేంద్రప్రసాద్, డీడీఎం తేజ్​రెడ్డి, ఆర్ఎస్ఈఏటి ఉట్నూర్ డైరెక్టర్​ కె.లక్ష్మణ్, యూబీఐ డిప్యూటీ రీజనల్ హెడ్ వంశీకృష్ణ, టీజీబీ రీజనల్ మేనేజర్ మురళీమనోర్​రావు, యూబీఐ మేనేజర్ గౌతమ్, ఎస్​బీఐ చీఫ్ మేనేజర్ సాగర్​రావు పాల్గొన్నారు.  

కొవిడ్ బూస్టర్ డోస్ త్వరగా పూర్తి చేయాలి...  

కొవిడ్ బూస్టర్ డోస్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతి హోళికేరి సంబంధిత అధికారులను ఆదేశించారు. పీహెచ్​సీలు, సబ్​ సెంటర్లలో డోస్​లు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హత గల వారందరూ డోస్ తీసుకునే విధంగా ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ పరిధిలోని సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అంగన్​వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు వారి పరిధిలోని వారందరు డోస్ తప్పనిసరిగా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు 11 వేల డోస్​లను వేయాలన్నారు.  

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మందమర్రి/రామకృష్ణాపూర్/బెల్లంపల్లి,వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్​ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలోని అన్ని అండర్ గ్రౌండ్, ఓసీపీ గనులు, డిపార్ట్​మెంట్లపై ధర్నాల చేశారు. ఈసందర్భంగా లీడర్లు మాట్లాడుతూ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అసమర్థత కారణంగా కార్మిక సమస్యలు పెండింగ్​లో ఉన్నాయన్నారు. లీడర్లు కేవలం పైరవీలకే పరిమితమయ్యారని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కారించడంలేదన్నారు. అరబిందో అనే ప్రైవేటు కంపెనీకి కేటాయించిన కోయగూడెం ఓసీపీ3 మైన్​ను కంపెనీకి తిరిగి అప్పగించాలని, సింగరేణిలో వాస్తవ లాభాల్లో ఎంప్లాయూస్​కు 35 శాతం వాటా ఇవ్వాలన్నారు. కార్మికులకు సొంతింటి పథకం కింద 2 గుంటల భూమి, 20 లక్షలు వడ్డీలేని లోన్​మంజూరు చేయాలన్నారు. కోలిండియా మాదిరి అలవెన్సుపై  ఇన్​కమ్​ టాక్స్​ను యాజమాన్యం చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్​ కార్మికులకు హైపవర్​ కమిటీ వేతనాలు అమలు చేయాలన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందించారు. నిరసనలో ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ, ఎండీ అక్బర్ అలీ, దాగం మల్లేశ్, వైస్​ ప్రెసిడెంట్లు భీమానాధుని సుదర్శనం, ఇప్పకాయల లింగయ్య, వెంకటస్వామి, సీనియర్​ లీడర్​ చిప్ప నర్సయ్య, కంది శ్రీనివాస్, పిట్ సెక్రటరీలు సురమల్ల వినయ్​కుమార్, సంజీవ్, ఆంజనేయులు, బత్తుల రాజ్​కుమార్​, వెల్ది  ప్రభాకర్, కొత్త తిరుపతి, సీహెచ్​.శర్మ, మార్రి కుమారస్వామి, మనోహర్,  ఏఐటీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకట స్వామి, శాంతి గని ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి, సీనియర్ లీడర్లు బొంకూరి రామచందర్, రంగ ప్రశాంత్, కె.అశోక్ కుమార్, మంతెన రమేశ్-, కె.అన్వేశ్, బియ్యాల ఉపేందర్, పులిపాక స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.