29 నుంచి టీచర్ల ‘48 గంటల విద్యా దీక్ష’

29 నుంచి టీచర్ల  ‘48 గంటల విద్యా దీక్ష’
  • కాంగ్రెస్‌, బీజేపీ మద్దతు కోరిన టీయూఎఫ్‌ 
  • టీచర్లు యూనియన్లకు అతీతంగా తరలిరావాలని పిలుపు  

హైదరాబాద్‌, వెలుగు: విద్యారంగం, టీచర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29వ తేదీన ‘48 గంటల విద్యా దీక్ష’ను ప్రారంభించనున్నట్టు టీచర్స్‌ యునైటెడ్‌ ఫోరం(టీయూఎఫ్‌) రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బానోతు కిషన్‌ నాయక్‌, బండ సంజీవరావు తెలిపారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం12 గంటలకు దీక్షను ప్రారంభిస్తామని వాళ్లు వెల్లడించారు. అక్టోబర్‌1న మధ్యాహ్నం12 గంటలకు ముగిస్తామని చెప్పారు. దీక్షకు హాజరై మద్దతు తెలపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను కోరినట్టు వారు తెలిపారు. విద్యారంగానికి రూ.50 వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి ప్రీ ప్రైమరీ నుంచి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే 63 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని విన్నవించారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, జేఎల్‌ పోస్టులతో పాటు అన్ని రకాల క్యాడర్‌లలో టీచర్లకు ప్రమోషన్ల ఇవ్వాలన్నారు. పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని,  మోడల్‌ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు సర్వీస్‌రూల్స్‌ రూపొందించి బదిలీలు చేయాలని కోరారు. ఎస్‌జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, లాంగ్వేజీ పండిట్ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాదీక్షలో యూనియన్లకు అతీతంగా టీచర్లందరూ పాల్గొన్నాలని పిలుపునిచ్చారు.