అకడమిక్ ఇయర్ మధ్యలో బదిలీలతో చదువులు ఆగం

అకడమిక్ ఇయర్ మధ్యలో బదిలీలతో చదువులు ఆగం
  • అకడమిక్​ ఇయర్​ మధ్యలో అలకేషన్స్​తో చదువులు ఆగం
  • ఇప్పటికే కరోనాతో నష్టపోయిన స్టూడెంట్లు
  • ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంటే సడెన్​గా అలకేషన్లు
  • 22 వేల మంది టీచర్లు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ట్రాన్స్​ఫర్​
  • చాలా స్కూళ్లలో సగానికి పైగా టీచర్ల మార్పు..
  • మళ్లీ ఆ బడులకు కొత్త టీచర్లు వస్తరో లేదో 
  • వేసవి దాకా పోస్టింగ్స్​ ఆపాలని టీచర్ యూనియన్ల డిమాండ్ 

మహబూబ్​నగర్​ జిల్లాలోని బలీదుపల్లి యూపీఎస్​లో120 మంది స్టూడెంట్లు ఉండగా, ఆరుగురు టీచర్లు పనిచేస్తున్నారు. కొత్త జిల్లాల అలకేషన్ లో భాగంగా ఇక్కడి ఆరుగురు టీచర్లు వేర్వేరు జిల్లాలకు అలాట్​ అయ్యారు. దీంట్లో ఐదుగురు వనపర్తి జిల్లాకు, ఒకరు నారాయణపేట జిల్లాకు మారారు. వీరి ప్లేస్​లో బలీదుపల్లి యూపీఎస్​కు కొత్త టీచర్లు వస్తారో లేదో తెలియడం లేదు.

మేడ్చల్ జిల్లాలోని గాజులరామారం జెడ్పీహెచ్​ఎస్​లో 450 మంది స్టూడెంట్లు, 11 మంది టీచర్లు ఉన్నారు. వీరిలో 8 మంది టీచర్లు వేర్వేరు జిల్లాలకు అలాటయ్యారు. ఏడుగురు రంగారెడ్డి జిల్లాకు, ఒకరు వికారాబాద్ జిల్లాకు మారారు. స్కూల్ మారినవారిలో ఇంగ్లిష్, సోషల్, మ్యాథ్స్, బయోసైన్స్, హిందీ సబ్జెక్టు టీచర్లున్నారు. దీంతో మళ్లీ ఈ సబ్జెక్టు టీచర్లు తమ దగ్గరకు వస్తరో రారో అనే ఆందోళన గాజులరామారం స్కూల్​ స్టూడెంట్లలో కనిపిస్తున్నది.

హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్​తో ఏడాదికిపైగా అటకెక్కిన స్కూల్ చదువులు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంటే.. రాష్ట్ర సర్కారు తీరుతో మళ్లీ ఆగమైతున్నాయి. టైమే దొరకనట్టు ఎంప్లాయీస్​తో కలిపి టీచర్లకు కూడా ప్రస్తుతం ప్రభుత్వం కొత్త జిల్లాల వారీగా అలకేషన్ ప్రక్రియ చేపట్టింది. పోస్టింగ్​లు కూడా మరో పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. అకడమిక్ ఇయర్​ మధ్యలో ఈ ప్రాసెస్​ నిర్వహిస్తుండటంతో ఇటు స్టూడెంట్లు, అటు టీచర్లు తిప్పలు పడుతున్నారు. అలకేషన్స్​లో నాల్గో వంతు టీచర్లు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు అలాట్​ అయ్యారు. కొన్నిస్కూళ్ల నుంచి మొత్తానికి మొత్తం టీచర్లు.. చాలా స్కూళ్ల నుంచి సగానికిపైగా టీచర్లు వేరే జిల్లాలకు మారారు. ఇట్లా టీచర్లు ఖాళీ అవుతున్న స్కూళ్లకు కొత్త టీచర్లు వస్తరో లేదోనన్న ఆందోళన అక్కడి స్టూడెంట్లలో నెలకొంది.

కొత్త టీచర్లు అడ్జెస్ట్​ అయ్యేసరికి ఎగ్జామ్స్​ వస్తయ్​

2021–22 అకడమిక్ ఇయర్​ జులైలో ప్రారంభమైనా, సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ క్లాసులు స్టార్టయ్యాయి. రాష్ట్రంలో 26,285 సర్కారీ స్కూళ్లుండగా, వాటిలో  21,11,641 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. కరోనా​ తర్వాత 20% నుంచి మొదలైన అటెండెన్స్.. ఈ మధ్యే పెరిగింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత స్కూళ్లకు వచ్చిన స్టూడెంట్లను, వారి మానసిక స్థితిని అక్కడి టీచర్లు మెల్లమెల్లగా సెట్​ చేస్తున్నారు. ఇప్పుడు సడెన్​గా అకడమిక్​ ఇయర్​మధ్యలో టీచర్ల ట్రాన్స్​ఫర్లు చేపట్టడంతో  పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. స్టూడెంట్లను కొత్త టీచర్లు అర్థం చేసుకోవడానికి టైం పడుతుందని, ఆలోగా ఎగ్జామ్స్ వచ్చేస్తాయని అంటున్నారు.  

వేసవిలో పోస్టింగ్​లని..అంతలోనే మార్పు!

రాష్ట్రంలో 1.05లక్షల మంది సర్కారీ టీచర్లున్నారు. ఇన్నాళ్లూ కొత్త జిల్లాల వారీగా అలకేషన్​ గురించి మాట్లాడని సర్కారు ఈ నెల ఫస్ట్ వీక్​లో అలకేషన్​ కోసం జీవో 317ను రిలీజ్ చేసింది. ప్రస్తుతమున్న టీచర్లను కొత్త జిల్లాల లెక్కన అలాట్ చేయనున్నట్టు ప్రకటించింది.  సుమారు నెల రోజుల నుంచి టీచర్లు ఇదే పనిలో మునిగిఉన్నారు.  అయితే.. ముందు కొత్త జిల్లాలకు టీచర్లను అలాట్ చేసి, వేసవి సెలవుల్లో పోస్టింగ్​లు ఇస్తామని సర్కారు లీకులిచ్చింది. దీంతో ఇప్పుడే ఈ బదిలీలు ఉండవనే ధీమాతో టీచర్లు ఉండగా.. అలకేషన్​ పూర్తయిందని, పది రోజుల్లో పోస్టింగ్​లు పూర్తి చేస్తామని 2 రోజుల కింద ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 22 వేల మంది టీచర్లు ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా నుంచి వేరే జిల్లాకు అలాట్​ అయ్యారు.  

టీచర్లకూ ఇబ్బందులే..

ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు 22 వేల మంది టీచర్లు అలాట్​ అయ్యారు. ఒక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 4 వేల మంది మారినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరులోపు కౌన్సెలింగ్ చేసి, పోస్టింగ్​లు ఇస్తారు. జనవరి ఫస్ట్​ వీక్​లో స్కూళ్లలో జాయిన్​ కావాల్సి ఉంటుంది. కొత్త జిల్లాల్లో ఫ్యామిలీలను ఎక్కడ పెట్టాలని అనుకుంటున్నారు. భార్యాభర్తల్లో ఇద్దరూ సర్కారు కొలువులు చేసేవారు ఉంటే స్పౌజ్ బదిలీలకు చాన్స్ ఇస్తామని చెప్తున్నా, ఎప్పుడు అమలు చేస్తుందో తెలియడం లేదు. వేసవి సెలవుల్లో పోస్టింగ్స్​ఇవ్వాలని టీచర్​ సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. 

ఒక్కో స్కూల్​లో ఒక్కో పరిస్థితి

  •     మహబూబ్​నగర్​ జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ అడ్డాకుల 485 మంది స్టూడెంట్లు ఉంటారు. దీంట్లో 19 మంది టీచర్లుంటే.. 11 మంది వేరే జిల్లాకు అలాట్ అయ్యారు. రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట తదితర జిల్లాలకు షిఫ్ట్ అయ్యారు. కొత్త జిల్లాకు వెళ్లినవారిలో మ్యాథ్స్, ఫిజిక్స్, తెలుగు, హిందీ, బయోలజీ సబ్జెక్టుల టీచర్లతో పాటు పీడీ ఉన్నారు.
  •     వికారాబాద్​జిల్లాలోని మారుమూల ప్రాంతమైన దౌల్తాబాద్​జెడ్పీహెచ్ఎస్ లో 575 మంది స్టూడెంట్లున్నారు. ఇక్కడ 14 మంది టీచర్లకు గానూ 9 మంది వేరే జిల్లాలకు అలాటయ్యారు. ఆరుగురు నారాయణపేట, ఒకరు వనపర్తి, ఒకరు నాగర్​కర్నూల్, ఒక మహబూబ్​నగర్ కు మారారు. జిల్లా మారే వారిలో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ తదితర సబ్జెక్టుల టీచర్లున్నారు. 
  •     సిరిసిల్ల జిల్లా బోయినిపల్లిలోని జెడ్పీహెచ్​ఎస్ లో 12 మంది టీచర్లుండగా.. 8 మంది కొత్త జిల్లాలకు మారారు. మారిన వారిలో మూడు లాంగ్వేజీల టీచర్లు, ఫిజికల్, బయోసైన్స్, సోషల్, మ్యాథ్స్​ టీచర్లు ఉన్నారు. అదే మండలంలోని నర్సింగాపూర్ హైస్కూల్​లో  8మంది టీచర్లు ఉండగా.. ఏడుగురు కొత్త జిల్లాలకు అలాటయ్యారు. 
  •     జగిత్యాల జిల్లా నాచుపల్లి హైస్కూల్​లో 86 మంది స్టూడెంట్లుండగా.. 8 మంది టీచర్లుంటే ఆరుగురు కొత్త జిల్లాలకు మారారు. బయోసైన్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, తెలుగు, సోషల్ టీచర్లతో పాటు పీఈటీ పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు అలాటయ్యారు.

స్టూడెంట్లకు నష్టం

అకడమిక్ ఇయర్ మధ్యలో టీచర్లను బదిలీ చేయడంతో స్టూడెంట్లకు ఎక్కువ నష్టం జరుగుతుంది. సడెన్​గా కొత్త జిల్లాలకు టీచర్లు వెళ్లాలంటే కూడా కష్టమే.  వాళ్లు ఇప్పటికిప్పుడు తమ ఫ్యామిలీని షిఫ్ట్​ చేసుకోవడం కుదరని పని. ఈ అకడమిక్ ఇయర్​ చివరి వరకూ కొత్త జిల్లాలకు కేటాయించిన టీచర్లను, పాత జిల్లాల్లోనే కొనసాగించాలి.

- ఎండీ అబ్దుల్లా, టీఎస్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ 

బదిలీలు వేసవిలో చేయాలె

కరోనా ఎఫెక్ట్​తో ఇప్పటికే అకడమిక్ ఇయర్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ బదిలీల ప్రక్రియతో వర్కింగ్ డేస్​ను స్టూడెంట్లు కోల్పోతున్నారు. సీనియారిటీలు తప్పుల తడకగా ఉండటంతో వీటితో కౌన్సెలింగ్ నిర్వహిస్తే టీచర్లకు తీవ్రనష్టం జరుగుతుంది. కాబట్టి సమగ్రమైన లిస్టులతో అందరికీ వేసవిలోనే బదిలీలు నిర్వహించాలి. 

- కటకం రమేశ్​, టీఆర్టీఎఫ్​ స్టేట్ జనరల్ సెక్రటరీ

ఈ టైంలో సరికాదు

అకడమిక్ ఇయర్ మధ్యలో బదిలీలు చేస్తే స్టూడెంట్లతో పాటు టీచర్లకు ఇబ్బందులొస్తాయి. నెలాఖరు లోపు ప్రక్రియ పూర్తిచేయాలనే దానిపై  సర్కారు ఆలోచించుకోవాలి. ఈ టైమ్​లో కొత్త టీచర్లు వస్తే స్టూడెంట్లను అర్థం చేసుకునేందుకు నెలలు పడుతుంది. ఏప్రిల్ వరకు ఎక్కడివారిని అక్కడే కొనసాగించాలి.

- జగదీశ్​, ఆర్​యూపీపీ స్టేట్ ప్రెసిడెంట్