మూడేళ్లలో ఆడింది 12 వన్డేలే..వాస్తవాలను చూపించండి

మూడేళ్లలో ఆడింది 12 వన్డేలే..వాస్తవాలను చూపించండి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌పై అసహనం వ్యక్తం చేశాడు. స్టార్ స్పోర్ట్స్ వాస్తవాలను అభిమానులకు చూపించాలని కోరాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. రోహిత్ సెంచరీని చూపించిన స్టార్ స్పోర్ట్స్..మూడేళ్ల తర్వాత రోహిత్ శర్మ సెంచరీ చేశాడని పదే పదే చెప్పింది. అయితే తాజా సెంచరీకి మూడేళ్ల పట్టిందని అధికారిక బ్రాడ్ కాస్టర్ ప్రచారం చేయడాన్ని రోహిత్ శర్మ తప్పు పట్టాడు. 

న్యూజిలాండ్‌తో మూడో వన్డే ముగిసిన తర్వాత  మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు 29, 30వ సెంచరీకి గ్యాప్ ఎందుకు వచ్చిందని రోహిత్ శర్మను ప్రశ్నించాడు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ...ఈ మూడేళ్లలో తాను కేవలం 12 వన్డేలే ఆడానని..దాన్ని గుర్తించాలన్నాడు. ఈ వాస్తవాన్ని స్టార్ స్పోర్ట్స్ చూపించకపోవడం సబబు కాదన్నాడు. మూడేళ్లలో తనకు ఇది మొదటి సెంచరీ అని..అయితే ఈ కాలంలో తాను కేవలం 12 వన్డేలు మాత్రమే ఆడానని చెప్పుకొచ్చాడు.  మూడేళ్లు అనేది చాలా ఎక్కువ కాలంగా వినిపిస్తోందని..కానీ అసలు నిజమేంటో  జర్నలిస్ట్‌లుగా అభిమానులకు తెలియజేయాలన్నాడు. 

న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో వన్డే సిరీస్ను టీమిండియా 3-0తో దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. కేవలం 85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో 101 పరుగులు సాధించాడు. దీంతో 2020 జనవరిలో ఆస్ట్రేలియాతో చివరి సారిగా సెంచరీ బాదిన రోహిత్ శర్మ.... 1100 రోజుల తర్వాత శతకం కొట్టాడు.