ఇలాగైతే ఎన్ని రన్స్‌ చేసిన వేస్టే..

ఇలాగైతే ఎన్ని రన్స్‌ చేసిన వేస్టే..

క్యాచ్‌ డ్రాప్‌లపై కోహ్లీ అసంతృప్తి

తిరువనంతపురం: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో క్యాచ్‌లు డ్రాప్‌ చేయడంపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్యాచ్‌లు పట్టడంలో ప్లేయర్లు మరింత ధైర్యంగా మారాలని, లేకపోతే ఎన్ని రన్స్‌ చేసినా మ్యాచ్​కాపాడుకోవడం కష్టమని స్పష్టం చేశాడు. భువనేశ్వర్‌ వేసిన ఓ ఓవర్‌లో మిడాఫ్‌లో సుందర్‌, వికెట్ల వెనుకాల రిషబ్‌ వరుసగా క్యాచ్‌లు మిస్‌ చేయడంతో సిమ్మన్స్‌, లూయిస్‌ విండీస్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే.

‘గత రెండు మ్యాచ్‌ల్లో మా ఫీల్డింగ్‌ చాలా చెత్తగా ఉంది. ఒకే ఓవర్‌లో మేం రెండు క్యాచ్‌లు వదిలేశాం. ఆ రెండు క్యాచ్‌లు పట్టి ఉంటే కరీబియన్లపై ఒత్తిడి పెరిగేది. మ్యాచ్‌ పరిస్థితి మరోలా ఉండేది. ఈ పేలవ ఫీల్డింగ్‌ ఇలాగే కొనసాగితే బోర్డుపై ఎన్ని రన్స్‌ ఉంచినా ప్రయోజనం ఉండదు. ముంబైలో డూ ఆర్‌ డై మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికైనా మా ఫీల్డర్లు ధైర్యంగా క్యాచ్‌లు తీసుకోవాలి’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

2018 నుంచి ఇప్పటివరకు ఇండియా 15 టీ20ల్లో మొదట బ్యాటింగ్‌ చేయగా ఏడింటిలో ఓడింది. ఛేజింగ్‌లో 18 మ్యాచ్‌ల్లో 14 గెలిచింది. అయితే రెండో టీ20లో తమ ఓటమికి ఫస్ట్‌ బ్యాటింగ్‌ కారణం కాదని, ఫీల్డింగ్‌ వల్లే ఓడామని కోహ్లీ తెలిపాడు. ‘స్టాట్స్‌ చాలా విషయాలు చెబుతాయి. కొన్నిసార్లు వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా ఉండవు. 16 ఓవర్లకు మా స్కోరు 140/4. కానీ చివరి నాలుగు ఓవర్లే మా కొంప ముంచాయి. 40, 45 రన్స్‌ చేయాల్సిన చోట 30 మాత్రమే వచ్చాయి. దీనిపై మేం దృష్టి పెట్టాలి. శివమ్‌ బ్యాటింగ్‌ మాకు చాలా ఉపకరించింది. విండీస్‌ బాగా కట్టర్స్‌ వేసింది. పేస్‌ ఛేంజ్‌ చేయడం కూడా మమ్ముల్ని దెబ్బకొట్టింది. మా కంటే వాళ్లే పిచ్‌ను బాగా అర్ధం చేసుకున్నారు’ అని విరాట్‌ వ్యాఖ్యానించాడు. మూడో నంబర్‌లో దూబేను పంపడం బాగా వర్కౌటైందని కోహ్లీ చెప్పాడు. మ్యాచ్‌ ఓడినా నాణ్యమైన హిట్టర్‌ దొరికాడని సంతోషం వ్యక్తం చేశాడు. ఓ స్టన్నింగ్‌ క్యాచ్‌తో హెట్‌మయర్‌ను ఔట్‌ చేయడం బాగా అనిపించిందన్నాడు.