వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తుకు అడుగు దూరంలో టీమిండియా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తుకు అడుగు దూరంలో టీమిండియా

హమ్మయ్య గెలిచాం.. ..ప్రస్తుతం టీమిండియా అభిమానులు అనుకునే మాట ఇది. ఎందుకంటే..బంగ్లాదేశ్తో ఉత్కంఠగా..నువ్వా నేనా అన్నట్లు సాగిన రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. 2-0తో సిరీస్ను క్లీస్ స్వీప్ చేసింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ విజయంతో భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్  ఫైనల్ బెర్తుకు మరింత దగ్గరైంది.  

 మెరుగైన స్థానం..

బంగ్లాదేశ్‌తో సిరీస్కు ముందు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానంలో ఉంది. అయితే ఈ సమయంలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఓటమి పాలవడంతో పాటు.. బంగ్లాదేశ్‌పై టీమిండియా టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంతో..పాయింట్ల సమీకరణాలు మారిపోయాయి. బంగ్లాపై విజయంతో  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా 58.93 విజయశాతంతో 99 పాయింట్లు సాధించి  రెండో స్థానానికి చేరుకుంది.  ఆస్ట్రేలియా 76.92 విజయ శాతంతో  120 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో ఉంది. 

సౌతాఫ్రికా ర్యాంకు డౌన్..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా 54.55 విజయ శాతం 72 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఇప్పటి వరకు ఎనిమిది టెస్టుల్లో విజయం సాధించింది. నాలుగు మ్యాచుల్లో ఓడింది. రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

ఫైనల్ బెర్తు ఖాయం అవ్వాలంటే...

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో పాయింట్ల పట్టికలో టాప్ -2 జట్లు తలపడతాయి. అయితే ఇందులో ఒక బెర్తు టీమిండియా సొంతం కావాలంటే..త్వరలో ఆసీస్తో జరిగే 4 టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది. అలా జరిగితే భారత్ విజయ శాతం 68.05 అవుతుంది. దీంతో ఫైనల్ బెర్తు ఖాయం అవుతుంది. ఒక వేళ 3-0తో ఆసీస్ పై భారత్ గెలిస్తే విజయ శాతం 64.35 ఉంటుంది. అయితే సౌతాఫ్రికా మాత్రం తర్వాత ఆడే 4 టెస్టుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫైనల్ బెర్తులో ఒక స్థానం ఆస్ట్రేలియాకు దాదాపు ఖరారు అయినట్లే. మిగతా బెర్తు కోసం...భారత్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు పోటీపడుతున్నాయి.