వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తు ఖాయమేనా..?

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్  బెర్తు  ఖాయమేనా..?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా అదరగొడుతోంది. వరుసగా రెండు టెస్టు్ల్లోనూ విజయం సాధించింది. నాగ్ పూర్ టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగులతో గెలిస్తే.. ఢిల్లీ టెస్టుల్లో 6వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్ లో భారత జట్టు 20-తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో టీమిండియా వరల్డ్  టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తుకు మరింత చేరువైంది. 

WTC పాయింట్లలో భారత్ స్థానం..!

ఐసీసీ WTC  పాయింట్ల పట్టికను గమినస్తే  భారత్ 64.06 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 66.67 పాయింట్లతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది.  2021-23 లో భారత జట్టు ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడి 10వ టెస్టు విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో పాయింట్ల శాతాన్ని 61.66 నుంచి 64.06కు పెంచుకుంది. మరోవైపు రెండు టెస్టుల్లో  ఓడిన ఆస్ట్రేలియా పాయింట్ పర్సంటేజ్ లో  70.83 నుంచి 66.67 శాతానికి పడిపోయింది. ఈ జాబితాలో శ్రీలంక 53.33 పాయింట్లతో మూడో స్థానంలో..సౌతాఫ్రికా 48.72 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అటు వెస్టిండీస్ 40.91 పాయింట్లతో ఆరో స్థానంలో, పాకిస్థాన్ 38.1 పాయింట్లతో ఏడో స్థానంలో.. న్యూజిలాండ్ 27.27 పాయింట్లతో 8వ స్థానంలో.. బంగ్లాదేశ్ 11.11 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాయి.

భారత్కు ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ కావాలంటే..?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఇంకా రెండు టెస్టులు ఆడాలి.  ఇందులో భారత్ ఒక్క టెస్టులో అయినా గెలిస్తే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుకుంటుంది. టీమిండియా కనుక సిరీస్‌ను భారత్ 3-1తో దక్కించుకుంటే 61.92 శాతం పాయింట్లతో ముగించి ఆస్ట్రేలియాతో కలిసి ఫైనల్ వెళ్తుంది. కానీ 2-2తో సిరీస్ డ్రా అయినా కూడా భారత్ నాలుగో స్థానంలో ఉన్న  దక్షిణాఫ్రికా కంటే మెరుగైన స్థితిలోనే ఉంటుంది.  అయితే ఈ  సమయంలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో శ్రీలంక ఓటమి పాలవ్వాలి.  ఒకవేళ టీమిండియా 3-0తో కానీ లేదా 4-0తో కానీ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను గెలిస్తే..ఏ సమీకరణాలతో పనిలేకుండా భారత జట్టు నేరుగా WTC ఫైనల్‌ చేరుకుంది. అప్పుడు రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా -శ్రీలంక పోటీపడతాయి. ప్రస్తుతం శ్రీలంక 53.33 పాయింట్ పర్సంటేజ్‌తో మూడో స్థానంలో  ఉంది. మార్చిలో న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో విజయం సాధిస్తే మాత్రం లంక  పాయింట్ల శాతం 60 దాటుతుంది.


WTC ఫైనల్ ఎప్పుడు..?

ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఈ ఏడాది జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. అయితే రెండో బెర్తు కోసం టీమిండియా, శ్రీలంక పోటీపడుతున్నాయి. తాజాగా రెండు టెస్టుల్లోనూ భారత్ గెలవడంతో  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ బెర్తుకు  టీమిడియా మరింత దగ్గరైంది.