శాంసన్‌ మెరిసినా..ఇండియా పరాజయం

శాంసన్‌ మెరిసినా..ఇండియా పరాజయం

లక్నో: స్టార్లు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా..  సౌతాఫ్రికాతో  మూడు వన్డేల సిరీస్‌‌ను ఓటమితో ప్రారంభించింది. సంజూ శాంసన్‌‌ (63 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 నాటౌట్‌‌), శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (37 బాల్స్‌‌లో 8 ఫోర్లతో 50) మెప్పించినా.. మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు. దాంతో,  గురువారం జరిగిన తొలి మ్యాచ్‌‌లో ఇండియా 9  రన్స్​తేడాతో  పరాజయం పాలైంది. మరోవైపు డేవిడ్‌‌ మిల్లర్‌‌ (63 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 నాటౌట్‌‌), హెన్రిచ్‌‌ క్లాసెన్‌‌ (65 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 నాటౌట్‌‌) హాఫ్‌‌ సెంచరీలకు తోడు బౌలర్లు కూడా రాణించడంతో సౌతాఫ్రికా  సిరీస్‌‌లో బోణీ కొట్టింది. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌‌లో టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన సౌతాఫ్రికా 249/4 స్కోరు చేసింది. డికాక్‌‌ (48), జనేమన్‌‌ (22) కూడా సత్తా చాటగా..  కెప్టెన్‌‌ బవూమ (8), మార్‌‌క్రమ్‌‌ (0) ఫెయిలయ్యారు. ఇండియా బౌలర్లలో  శార్దూల్‌‌ (2/35) రెండు, బిష్ణోయ్‌‌ (1/69), కుల్దీప్‌‌ యాదవ్‌‌ (1/39) ఒక్కో వికెట్‌‌ తీశారు.

అనంతరం ఇండియా 40 ఓవర్లలో 240/8 స్కోరు చేసి ఓడింది. కెప్టెన్‌‌ ధవన్‌‌ (4), గిల్‌‌ (3), రుతురాజ్‌‌ (19), ఇషాన్‌‌ (20) నిరాశ పరిచారు. శ్రేయస్‌‌తో ఐదో వికెట్‌‌కు 67, శార్దూల్‌‌ (33)తో ఆరో వికెట్‌‌కు 93 రన్స్‌‌ జోడించిన శాంసన్‌‌ ఆశలు రేపాడు. కానీ, చివర్లో సఫారీ బౌలర్లు మళ్లీ పుంజుకొని దెబ్బకొట్టారు. షంసీ (1/ 89)వేసిన లాస్ట్‌‌ ఓవర్లో 31 రన్స్‌‌ అవసరం అవగా... సంజూ సిక్స్‌‌, మూడు ఫోర్లు కొట్టినా ఫలితం లేకపోయింది. సఫారీ బౌలర్లలో ఎంగిడి (3/52), రబాడ (2/36) సత్తా చాటారు.   క్లాసెన్​కుప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరుగుతుంది. 

సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా: 40 ఓవర్లలో  249/4 (మిల్లర్‌‌ 75 నాటౌట్‌‌, క్లాసెన్‌‌ 74 నాటౌట్‌‌, శార్దూల్ 2/35).
ఇండియా: 40 ఓవర్లలో 240/8 (శాంసన్‌‌ 86 నాటౌట్‌‌, శ్రేయస్‌‌ 50, ఎంగిడి 3/52).