మూడో టీ20లో ఇండియా ఓటమి

మూడో టీ20లో ఇండియా ఓటమి

ఇండోర్‌‌: బ్యాటింగ్‌‌లో ఫెయిలైన ఇండియా టీమ్‌‌.. సౌతాఫ్రికాతో సిరీస్‌‌ను ఓటమితో ముగించింది. దీంతో మంగళవారం జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో సఫారీ టీమ్‌‌ 49 రన్స్‌‌ తేడాతో టీమిండియాపై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో రోహిత్‌‌సేన ఆధిక్యాన్ని 2–1కి తగ్గించింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 227/3 స్కోరు చేసింది. స్టార్టింగ్‌‌ నుంచే డికాక్‌‌(68)..టీమిండియా బౌలర్లపై విరుచుకుపడగా, కెప్టెన్‌‌ బవుమా (3) మరోసారి విఫలమయ్యాడు. ఐదో ఓవర్‌‌లో ఉమేశ్‌‌ దెబ్బకు ఔట్‌‌కావడంతో తొలి వికెట్‌‌ 30 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఈ దశలో వచ్చిన రోసోవ్‌‌(100*).. ఆతిథ్య బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. అశ్విన్‌‌ ఓవర్‌‌లో సిక్స్‌‌తో టచ్‌‌లోకి వచ్చిన అతను క్రీజులో ఉన్నంతసేపు బౌండ్రీలకే మొగ్గు చూపాడు. ఏడో ఓవర్‌‌లో డికాక్‌‌, రోసోవ్‌‌ 4, 6 బాదితే, 9వ ఓవర్‌‌లో ఇద్దరూ చెరో సిక్స్‌‌, ఆ తర్వాత 4, 6తో రెచ్చిపోయారు. ఫలితంగా పవర్‌‌ప్లేలో 48/1 ఉన్న స్కోరు ఫస్ట్‌‌ టెన్‌‌లో 96/1కి చేరింది. ఈ క్రమంలో డికాక్‌‌ 33 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. 11వ ఓవర్‌‌లో డికాక్‌‌ 4, 4, రోసోవ్‌‌ 6తో 18 రన్స్‌‌ రాబట్టారు. కానీ 13వ ఓవర్‌‌లో డికాక్‌‌ ఔట్‌‌కావడంతో రెండో వికెట్‌‌కు 89 (47 బాల్స్‌‌) రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. తర్వాత స్టబ్స్‌‌ (23) కూడా సమయోచితంగా స్పందించాడు. రోసోవ్‌‌తో కలిసి ఓవర్‌‌కు ఓ ఫోర్‌‌, సిక్స్‌‌ కొట్టడంతో మూడో వికెట్‌‌కు 87 (44 బాల్స్‌‌) రన్స్‌‌ జతయ్యాయి. చివర్లో మిల్లర్‌‌ (19 నాటౌట్‌‌) కూడా మెరుపులు మెరిపించాడు. ఈ క్రమంలో రోసోవ్‌‌ 48 బాల్స్‌‌లో సెంచరీ ఫినిష్‌‌ చేయగా, నాలుగో వికెట్‌‌కు 4 బాల్స్‌‌లోనే 20 రన్స్‌‌ సమకూరడంతో సఫారీలు భారీ టార్గెట్‌‌ను నిర్దేశించారు. చహర్‌‌, ఉమేశ్‌‌ చెరో వికెట్‌‌ తీశారు. 

కార్తీక్‌‌ ఒక్కడే..
టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఇండియా 18.3 ఓవర్లలో 178 రన్స్‌‌కు ఆలౌటైంది. దినేశ్‌‌ కార్తీక్‌‌ (21 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46) టాప్‌‌ స్కోరర్‌‌. కెప్టెన్‌‌ రోహిత్‌‌ (0) రెండో బాల్‌‌కే ఔట్‌‌కావడంతో సరైన ఆరంభం లభించలేదు. సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో ఇండియా వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంది. రిషబ్‌‌ పంత్‌‌ (27) కాసేపు పోరాడినా.. రెండో ఎండ్‌‌లో శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (1) నిరాశపర్చాడు. మధ్యలో దినేశ్‌‌ కార్తీక్‌‌ మెరుపులు మెరిపించినా ఎక్కువసేపు నిలబడలేదు. సూర్య కుమార్‌‌ (8), అక్షర్‌‌ పటేల్‌‌ (9), హర్షల్‌‌ (17), అశ్విన్‌‌ (2) విఫలమయ్యారు. చివర్లో చహర్‌‌ (31), ఉమేశ్‌‌ యాదవ్‌‌ (20 నాటౌట్‌‌) తొమ్మిదో వికెట్‌‌కు 48 రన్స్‌‌ జోడించినా ప్రయోజనం లేకపోయింది. ప్రొటీస్‌‌ బౌలర్లలో ప్రిటోరియస్‌‌ 3, కేశవ్‌‌, ఎంగిడి, పార్నెల్‌‌ తలా రెండు వికెట్లు తీశారు. రోసోవ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’, సూర్యకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌’ అవార్డులు లభించాయి.