
న్యూఢిల్లీ : వరల్డ్‌కప్ కోసం ఇంగ్లండ్ వెళ్లబోయే టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా ఉందని జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా టీమ్ కాంబినేషన్‌పై నిర్ణయం ఉంటుందన్నాడు. వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వస్తాడా అనే అంశంపై శాస్త్రి మాట్లాడుతూ..
‘నాలుగో నంబర్ ప్లేస్ గురించి ఆందోళన లేదు. ఆ ప్లేస్‌లో బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్నవాళ్లు మా జట్టులో కావాల్సినంత మంది ఉన్నారు. ప్రతిదానికి మా దగ్గర సరిపడా ఆయుధాలున్నాయి. నాకు తెలిసి జట్టు ఎంపికలో మేము అన్ని విభాగాలను కవర్ చేశాం. ఎంపికైన 15 మంది అవకాశం దక్కినప్పుడు తమని తాము నిరూపించుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. బ్యాకప్ విషయంలో కూడా బెంగలేదు. పొరపాటున పేసర్ ఎవరైనా గాయపడితే వెంటనే మరో బౌలర్ అందుబాటులో ఉన్నాడు. ఐపీఎల్‌లో గాయపడిన కేదార్ జాదవ్‌కు అదృష్టవశాత్తు ఫ్రాక్చర్ కాలేదు. ఇంకా సమయం ఉంది కాబట్టి అతను కొలుకుంటాడు. ఇంగ్లండ్‌కు బయలుదేరేది 22న కాబట్టి ఏ 15 మంది ఫ్లైయిట్‌ఎక్కుతారో చూద్దాం. నేనైతే ప్రస్తుతానికి అంత దూరం ఆలోచించలేదు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
కాగా ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా టీమ్‌ల ఎలా ఆడతాయనేది ఆసక్తికరంగా ఉందన్నాడు. ‘కరీబియన్ జట్టు ఇండియా టూర్‌కు వచ్చినప్పుడు మేము సులువుగా సిరీస్ గెలుస్తాం అనుకున్నా. కానీ ఆ జట్టు చాలా పోరాటపటిమ చూపింది. వరల్డ్‌కప్ జట్టులో క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్ చేరికతో మరింత బలంగా తయారైంది. పైగా పవర్ హిట్టింగ్‌లో ఆ జట్టుకు దరిదాపుల్లో మరే టీమ్ లేదు. భారీ సిక్స్‌లు కొట్టే విషయంలో ఆ జట్టు ఆటగాళ్లు అందరికంటే ఒక మెట్టు ముందే ఉన్నారు. మరో పక్క ఐదు వరల్డ్‌కప్‌లు నెగ్గిన ఆస్ట్రేలియా పోరాడకుండా తప్పుకున్న టోర్నీ ఇప్పటిదాకా లేనేలేదు. పైగా వార్నర్, స్మిత్ చేరికతో ఆ టీమ్ మళ్లీ బలంగా తయారైంది. అందుకే వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఆటపై ఆసక్తిగా ఉన్నా’ అని హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు.