IndvsAus: డ్రా దిశగా భారత్ ఆస్ట్రేలియా నాల్గో టెస్ట్

IndvsAus: డ్రా దిశగా భారత్ ఆస్ట్రేలియా నాల్గో టెస్ట్

అహ్మదాబాద్‌ టెస్టు డ్రా దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480 పరుగులు చేయగా..టీమిండియా తొలి ఇన్నింగ్స్లో  571 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్పై  91 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది.  డబుల్ సెంచరీ చేస్తాడనుకున్న విరాట్ కోహ్లీ..186 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముర్ఫీ బౌలింగ్ లో చివరి  వికెట్గా నిష్క్రమించాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పితో బ్యాటింగ్కు రాలేదు. 

ఆ తర్వాత రెండో  ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా నాల్గో రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూ కున్హేమన్ (0), ట్రావిస్ హెడ్ (3) పరుగులతో ఉన్నారు. 

ఓవర్‌నైట్‌ స్కోరు 289/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ను కోహ్లీ ముందుండి నడిపించాడు. రవీంద్ర జడేజాతో కలిసి నాలుగో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఇదే క్రమంలో టెస్టుల్లో 28వ సెంచరీ, ఓవరాల్గా 75వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా ఔటైనా...శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్‌తో కీలక భాగస్వామ్యాలను నెలకొల్పి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అక్షర్ పటేల్ ఔటైన తర్వాత ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, అశ్విన్ వెంటవెంటనే ఔటయ్యారు. అయితే 186 పరుగులు చేసి డబుల్ సెంచరీకి చేరువలో ఉన్న కోహ్లీ..చివరి వికెట్గా ఔటయ్యాడు.  ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌, ముర్ఫీ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్‌, మాథ్యూ తలో వికెట్‌ తీశారు.