సెకండ్ వన్డేలో టీమిండియా విక్టరీ

సెకండ్ వన్డేలో టీమిండియా విక్టరీ

విండీస్ పర్యటనలో టీమిండియా దుమ్ము రేపుతోంది. ఇప్పటికే తొలి వన్డేలో విక్టరీ కొట్టిన ధావన్ సేన..రెండో వన్డేలోనూ విజయం సాధించింది. ఆతిధ్య జట్టుపై 2 వికెట్లతో గెలిచి మూడు వన్డే సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది. 

హోప్ సెంచరీ..
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన విండీస్..50 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది.  ఓపెనర్లు హోప్‌‌ (135 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 115) సెంచరీతో దంచికొట్టాడు. అతనికి  మేయర్స్‌‌ (39) సహకరించాడు. పేసర్లు సిరాజ్‌‌, అవేశ్‌‌ ఖాన్‌‌ వికెట్లు తీయడంలో విఫలంకావడంతో.. ఈ ఇద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్‌‌ చేశారు.  పార్ట్‌‌ టైమ్‌‌ బౌలర్‌‌ హుడా (1/42).. 10వ ఓవర్‌‌లో మేయర్స్‌‌ను ఔట్‌‌ చేయడంతో తొలి వికెట్‌‌కు 65 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. వన్‌‌డౌన్‌‌లో బ్రూక్స్‌‌ (35) నిలకడగా ఆడాడు. వరుస ఓవర్లలో అక్షర్‌‌ పటేల్‌‌ (1/40), చహల్‌‌ (1/69).. బ్రూక్స్‌‌, బ్రెండన్‌‌ కింగ్‌‌ (0)ను పెవిలియన్‌‌కు చేర్చడంతో విండీస్‌‌ 130/3 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో నికోలస్‌‌ పూరన్‌‌ (77 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 6 సిక్సర్లతో 74) అటాకింగ్‌‌ గేమ్‌‌ ఆడాడు. హోప్‌‌తో నాలుగో వికెట్‌‌కు 117 రన్స్‌‌ జోడించి భారీ స్కోరుకు బాటలు వేశాడు. చివర్లో రోవ్‌‌మన్‌‌ పావెల్‌‌ (13), షెపర్డ్‌‌ (14 నాటౌట్‌‌) మోస్తరుగా ఆడినా.. హోప్‌‌ 125 బాల్స్‌‌లో సెంచరీ పూర్తి చేశాడు. శార్దూల్‌‌ ఠాకూర్‌‌ 3 వికెట్లు తీశాడు.

అక్షర్ అదుర్స్..
312 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్..49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ ధావన్ విఫలమైనా..శుభమాన్ గిల్ 43 రన్స్ చేశాడు. హాఫ్ సెంచరీకి 7 పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఆ వెంటనే సూర్యకుమార్ యాదవ్ కూడా త్వరగానే పెవీలియన్ చేరాడు. దీంతో భారత్ 79 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నారు. ఇదే క్రమంలో వీరిద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే సంజూ, శ్రేయస్ స్వల్ప వ్యవధిలో నిష్క్రమించడంతో మరోసారి భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సులు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 35 బంతుల్లోనే 64 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. విండీస్ బౌలర్లలో జోసెఫ్, మేయర్స్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. 

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-0తో దక్కించుకుంది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చివరి వన్డే బుధవారం జరగనుంది.