ఆసీస్ తో టీ20 సమరానికి భారత్ సిద్ధం

ఆసీస్ తో టీ20 సమరానికి భారత్ సిద్ధం

మొహాలీ: రేపటి నుంచి ఆసీస్ తో టీమ్ ఇండియా టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది. మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో రెండు జట్లు తలపడనున్నాయి. ఇటీవల ఆసియా కప్ మ్యాచ్ లో కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగి అదరగొట్టాడు. దీంతో వచ్చే నెల జరిగే టీ 20 ప్రపంచ కప్ లోనూ కోహ్లీనే ఓపెనర్ గా దిగుతాడని అభిమానులు అంచనా వేశారు. అయితే జరగబోయే మెగా టోర్నీ ఓపెనర్లపై రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చేశాడు. 

ఓపెనర్లుగా రోహిత్, రాహుల్

టీ 20 ప్రపంచ కప్ వంటి పెద్ద టో ర్నీకి ముందు ఎలాంటి ప్రయోగాలు చేయాలనుకోవడం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. తనతో పాటు రాహుల్ ఇన్నింగ్స్ మొదలు పెడతాడన్నాడు. అయితే ఓపెనింగ్ కోసం విరాట్ కోహ్లీ తమ మూడో ఎంపిక అని స్పష్టం చేశాడు. ఓపెనర్ గా కోహ్లీ ఎలా ఆడాడో చూశామని, ఆసియా కప్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ సంతోషాన్ని ఇచ్చిందని రోహిత్ తెలిపాడు. కోహ్లీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఓపెనర్ ను ఎంపిక చేయలేదన్నాడు. టీ20 ప్రపంచకప్ లో తనతో పాటు కేఎల్  రాహుల్  ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాడని, ఇన్నింగ్స్ ప్రారంభమయ్యాక ఇద్దరిలో ఎవరికైనా గాయాలు అయితే కోహ్లీ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉందన్నాడు. టీమ్ ఇండియాకు రాహుల్ అత్యంత కీలక ఆటగాడని తెలిపాడు. గత రెండు, మూడేళ్లుగా అతని ప్రదర్శన బాగుందని తెలిపాడు. దీనిపై ఎలాంటి గందరగోళం లేదని ఇండియన్ స్కిప్పర్ స్పష్టం చేశాడు.

జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్

మరోవైపు పేసర్ షమి కరోనా బారిన పడటంతో అతరి స్థానంలో ఉమేశ్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నారు. సిరాజ్ కౌంటీల్లో ఆడుతున్నాడని, అలాగే అవేశ్ ఇంకా అనారోగ్యం నుంచి కోలుకోలేదని రోహిత్ తెలిపాడు. ప్రసిద్ధ్ గాయంతో బాధపడుతున్నట్లు తెలిపాడు. దీంతో  ఉమేశ్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నామన్నాడు రోహిత్. ఉమేశ్, షమి లాంటి సీనియర్  పేసర్లు ఏ ఫార్మాట్లో అయినా బౌలింగ్  చేయగలరని రోహిత్  తెలిపాడు.  ఐపీఎల్ లో ఉమేశ్  బంతుల వేసిన తీరే ఇందుకు నిదర్శనమన్నాడు.

ప్రాక్టీస్ మొదలు పెట్టిన భారత ఆటగాళ్లు

మరోవైపు రేపు ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్ కు సిద్ధమవుతోంది భారత జట్టు. ఇప్పటికే మొహాలీ చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగే మూడు టీ 20 సిరీస్ ల కోసం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. మొహాలీకి చేరుకున్న ఇండియా టీమ్ పీపీఏ స్టేడియంలో  జట్టు నెట్ సెషన్ లో పాల్గొంది. అయితే టీ 20 సిరీస్ కోసం కోహ్లీ గట్టిగానే కష్టబడుతున్నట్లు తెలుస్తోంది. అందరికంటే ముందే స్టేడియంకు చేరకున్న కోహ్లీ పేస్, స్పిన్, బౌలింగ్ లో భారీ షాట్లను ప్రాక్టీస్ చేశాడు.